రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా బాధ్యుడు రావి రామనాథం బాబు అన్నారు. మార్టూరు మండలం జొన్నతాళి గ్రామంలో పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రావి రామనాథం బాబు నూతనంగా ఏర్పాటు చేసిన బోరును ప్రారంభించారు. మెట్ట భూములకు సాగునీరు అందించే సదుద్దేశంతో ప్రజా సంకల్పయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ జలకళ (ఉచిత బోర్లు) పథకాన్ని ప్రారంభించారన్నారు.
3 లక్షల మంది అన్నదాతలకు..
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లకు రూ. 2,340 కోట్ల రూపాయలను కేటాయించారని తెలిపారు. సొంతంగా 2.5 ఎకరాల పొలం కలిగి ఉండి, బోరు బావి లేని రైతులు ఈ పథకం కింద అర్హులని ఆయన స్పష్టం చేశారు.
తక్కువ ఉన్నా పర్వాలేదు..
నిర్ణీత భూమి కంటే తక్కువ కలిగిఉన్నా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మరికొందరు రైతులతో కలిసి ఓ గ్రూప్‌గా ఏర్పడాలని సూచించారు. ఫలితంగా ఉచిత బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అన్నదాతలకు వివరించారు.
సద్వినియోగం చేసుకోవాలి..
చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు ఈ పథకం కింద ప్రాధాన్యత కల్పిస్తున్నామని.. అర్హులైన రైతులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో మార్టూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం.శ్యాంప్రసాద్, మండల రెవెన్యూ అధికారి ఈదా వెంకటరెడ్డి, గ్రామ కార్యదర్శి చక్రవర్తి, మండల పార్టీ కన్వీనర్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ఘనతే ఆజాద్‌కే దక్కుతుంది: సీఎం జగన్