ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలు తుది దశకు చేరుకున్నాయి. తొలుత బరిలోకి దిగిన గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన నల్లమోతు వీరయ్య కోడెలు.. నిర్ణీత సమయం ముగిసే సరికి 2,134 అడుగుల దూరం బండను లాగాయి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన నల్లూరి రామకోటయ్య ఎడ్లు.. 3,600 అడుగుల దూరం లాగి పోటీలో ముందంజలో ఉన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కామినేని గగణా చౌదరి, నయనా చౌదరి ఎడ్లు 3,100.. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవకు చెందిన కర్రి శ్రీనివాసరావు ఎడ్లు 2,742.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లికి శ్రీనివాసరావు ఎడ్లు 2,728 అడుగులతో కొనసాగుతున్నాయి.
తెలుగురాష్ట్రాల నుంచి పలు ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొనగా.. సీనియర్ విభాగంలో చివరి దశకు 10 జతలు అర్హత సాధించాయి. తుది పోరు కావడంతో ఈ పోటీలను తిలకించేందుకు ఆయా జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. యువకులు సైతం ఆసక్తి చూపుతుండటంతో ప్రాంగణమంతా కిక్కిరిసింది. ఫ్లడ్ లైట్ల కాంతిలో అర్థరాత్రివరకు పోటీలు కొనసాగనున్నాయి. వీక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: