పంచాయతీల్లో రసవత్తరంగా పోటీ సాగుతున్న వేళ పురపోరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపడంతో ఆసక్తి నెలకొంది. ఈ ప్రకటనతో ప్రకాశం జిల్లా చీరాలలో ప్రధాన పార్టీలు, బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 312 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ఎవరికి బీ ఫామ్లు లభిస్తాయనే విషయం చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రక్రియ గతేడాది ఏక్కడ నిలిచిపోయిందో.. అక్కడి నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్లు అధికారులు ప్రకటించారు.
గతేడాది నామినేషన్ల వివరాలు..
గతేడాది మార్చి 11 నుంచి నామినేషన్ల ప్రక్రయ ప్రారంభమైంది. 14 రాత్రి వరకు కొనసాగిన ఈ ప్రక్రియలో మొత్తంగా 318 మంది నామినేషన్లు వేశారు. మరుసటిరోజు 6 తిరస్కరణకు గురయ్యాయి. 312 మంది బరిలో మిగిలారు. వీరిలో వైకాపా 236, తెదేపా 23, జనసేన 6, కాంగ్రెస్ 7, భాజపా 3, సీపీఎం 2, బిఎస్పీ 2, ఇతరులు 33 మంది అభ్యర్థులున్నారు. ఉపసంహరణకు ఒక్కరోజు గడువు ఉన్న సమయంలో కరోనా ప్రభావంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు ఎస్ఈసీ ప్రకటించింది. అక్కడితో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
చర్చనీయాంశంగా మారిన బీ ఫామ్లు..
చీరాలలో అధికారపార్టీలో వర్గపోరు ఉండటంతో.. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కొత్త ప్రకటన ప్రకారం మార్చి 23న జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏ వర్గం వారు ఉంటారు. ఎవరికి బీ ఫామ్ లు లభిస్తాయనే విషయం చర్చనీయాంశమైంది. మరోవైపు తెదేపా అభ్యర్థులు.. మొత్తం 33 వార్డులు ఉంటే 23 చోట్ల మాత్రమే బరిలో ఉన్నారు. భాజపా, జనసేన, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పది లోపే నామినేషన్లు వేశారు.
ఓటర్ల వివరాలు..
చీరాల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 67,077 మంది ఉండగా.. వీరిలో పురుషులు 32,437 మంది, మహిళలు 34,638 మంది, ఇతరులు నలుగురు ఉన్నారు.