రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... ప్రకాశం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. యర్రగొండపాలెంలో మంత్రి పర్యటించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. ధరల వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరకుల దుకాణాలోని ధరల పట్టికను పరిశీలించారు.
కరోనా వైరస్ వ్యాపి చెందకుండా బ్లీచింగ్, ఫినాయిల్, సోడియం క్లోరైట్ కలిపిన ద్రావనాన్ని రోడ్లపై పిచికారీ చేశారు. అనంతరం మాచర్ల రహదారిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ గదులను పరిశీలించి... తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను ప్రతీఒక్కరూ పాటించాలని మంత్రి సూచించారు. అనవసరంగా రోడ్లపైకి రావద్దని కోరారు. ఎవరైనా దిల్లీ ప్రార్థనలకు వెళ్లి ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. వలస కూలీలు ఎక్కడి వారు అక్కడే ఉండాలని చెప్పారు. ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉండాలన్నారు. రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి వారికి అవసరమైన ట్రక్కులకు అనుమతి ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కరోనా గురించి అంతుచిక్కని 5 రహస్యాలివే..