ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజున వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ప్రారంభించడం శుభపరిణామమని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీరాలలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం చేనేత నేస్తం పథకాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన రాజకీయ ప్రత్యర్థి, చీరాల తేదేపా ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, తెదేపా ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి సంవత్సరానికి 24 వేల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు.
ఉప వృత్తుల వారికి అందజేయండి
చీరాల నియోజకవర్గాన్ని అందరం కలిసి అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి చెప్పారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ చేనేత నేస్తం పధకాన్ని చేనేత ఉపవృత్తులవారికి కూడా అందజేయాలని మంత్రి బాలినేనిని కోరారు. స్పందించిన మంత్రి... సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులకు చేనేత నేస్తం పథకం చెక్కులను అందజేశారు. అయితే... తెదేపా, వైకాపా కు చెందిన నేతలు, కార్యకర్తలు ఈ సమావేశంలో ఉన్నా.. ఎటువంటి గొడవలు జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీ చదవండి: