Fire Accident Man Dead: ప్రకాశం జిల్లాలో అద్దె చెల్లించటంలేదనే కోపంతో దుకాణంలోని సామగ్రికి నిప్పంటించిన వ్యక్తి అదే మంటల్లో చిక్కుకుని మరణించాడు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో దర్శి పట్టణంలోని కోతమిషన్ బజారులో పోతంశెట్టి వరప్రసాద్(45) అనే వ్యక్తి కుటుంబంతో నివసిస్తున్నారు. కురిచేడు రోడ్డులో ఓ బంగారు దుకాణాన్ని నడుపుతున్నాడు. అదే ప్రాంతంలో ఉన్న మరో దుకాణాన్ని ఆవుల శ్రీనివాసులు అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. అతడు ఆ దుకాణంలో షామియానా వస్తువులు ఉంచాడు.
ఇంట్లో గ్యాస్ లీకై చెలరేగిన మంటలు.. నలుగురికి గాయాలు
అయితే అతడు 2020 నుంచి అద్దెను మాత్రం చెల్లించట్లేదు. దీనిపై ఎన్నిసార్లు అడిగినా అతడు సరైన సమాధానం చెప్పట్లేదు. దీంతో కోపోద్రిక్తుడైన షాప్ యజమాని వరప్రసాద్.. దుకాణానికి నిప్పంటించాలనే నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నట్లుగానే ఆదివారం తెల్లవారుజామును 5.30 గంటల సమయంలో ఆ దుకాణానికి వెళ్లాడు. షాప్‌కు తాళం కూడా వేయకపోవటంతో.. షట్టర్‌ను తెరిచి.. లోపల ఉన్న సామగ్రిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు.
అయితే ఆ మంటలు అతడికి కూడా అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వరప్రసాద్‌ను బయటకు లాగారు. వెంటనే అతడిని 108 అంబులెన్స్‌లో సామాజిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడి శరీరం 80 శాతానికి పైగా మంటల్లో కాలిపోయింది. దీంతో అతడిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అయితే అతడిని పరిశీలించిన వైద్యులు.. అప్పటికే వరప్రసాద్ మరణించినట్లు తెలిపారు.
Fire accident: తిరుపతి బాణసంచా గిడ్డంగిలో అగ్నిప్రమాదం, ముగ్గురు సజీవదహనం
వరప్రసాద్, ఉమాదేవి దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు గుంటూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. ఓ కుమార్తెకు గుంటూరులోని ఆదివారం పరీక్ష ఉండగా.. కుమారుడిని కూడా చూసేందుకు దంపతులిద్దరూ కలిసి వెళ్దామని అనుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున అతడికి ఆరోగ్యం సరిగా లేదని మాత్రలు తెచ్చుకుంటానని భార్యతో చెప్పి బయటకు వెళ్లాడు.
బయటకు వెళ్లిన వ్యక్తి ఇంకా రాకపోయేసరికి.. పరీక్షకు ఆలస్యం అవుతుందని భావించిన అతడి భార్య ఉమాదేవి.. కుమార్తెతో కలిసి ముందుగా వెళ్దామని నిర్ణయించుకుంది. ఈ విషయంపై తన భర్తకు సమాచారం అందించి.. డ్రైవర్‌తో కలిసి తర్వాత తనను రమ్మని చెప్పి బయలుదేరింది. అయితే ఈ క్రమంలో వారు మార్గమధ్యలో ఉండగానే.. భర్త చనిపోయిన సమాచారం వారికి అందింది. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కుటుంబ సభ్యులు.. ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు.
ఈఓ కార్యాలయానికి నిప్పు.. వేల ఎకరాల ఆలయ భూ పత్రాలు అగ్నికి ఆహుతి..