ప్రకాశం జిల్లా కురిచేడు దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితులు శానిటైజర్లను ఎప్పటి నుంచి సేవిస్తున్నారు ?..,ఎవరి వద్ద వాటిని కొనుగోలు చేశారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. దర్శి డీఎస్పీ ప్రకాశరావు ఆధ్వర్యంలోని బృందం గ్రామంలో మద్యానికి బానిసైన వారిని కలిసి విచారిస్తోంది. శానిటైజర్ తాగడం వల్ల గత మూడురోజుల్లో 11 మంది మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. శనివారం మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు కురిచేడులో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే విచారణ అధికారులతో సమావేశమై అధికారులకు పలు సూచనలు చేశారు. కురిచేడు శానిటైజర్ మరణాలపై సమగ్ర దర్యాప్తునకు ఆరుగురు పోలీసు అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తు బృందానికి అధికారిగా మార్కాపురం ఓఎస్డీ చౌడేశ్వరిని నియమించినట్లు సమాచారం.
ఇదీచదవండి