Delhi Liquor Scam : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసిన రాఘవను ఈడీ 10 రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. నేటితో కస్టడీ గడువు ముగియడంతో రాఘవకు రౌస్ అవెన్యూ కోర్టు.. జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మార్చి 4వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంటారు. కోర్టు ఆదేశాల మేరకు రాఘవను తిహాడ్ జైలుకు తరలించారు. దర్యాప్తుకు సహకరించడం లేదని ఈనెల 10న సాయంత్రం ఆరుగంటల సమయంలో మాగుంట రాఘవను ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని.. అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. మరుసటి రోజు.. రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపరిచి.. పది రోజుల కస్టడీకి తీసుకున్నారు.
కస్టడీ ముగియడంతో.. రాఘవను ఈడీ అధికారులు కోర్టులో హజరుపరచగా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను మార్చి 4 వరకు విధిస్తూ.. ఆదేశాలు ఇచ్చింది. ఇదే కేసులో అరెస్టు అయిన రాజేష్ జోషికి కూడా రిమాండ్ విధించింది. మద్యం కుంభకోణం వ్యవహారంలో ఇప్పటివరకు సీబీఐ, ఈడీ అరెస్టు చేసిన.. నిందితులు అందరికీ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తమకు బెయిల్ మంజూరు చేయాలని.. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరిస్తూ.. ఈనెల 16న ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదే కేసులో ఈనెల 19న విచారణకు హాజరుకాలేక పోతున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలపడంతో... ఈనెల 26న రావాలని సీబీఐ తాజాగా తాఖీదులు పంపింది. ఇండో స్పిరిట్ కంపెనీలో రాఘవకు భాగస్వామ్యం ఉందని పేర్కొంది. మద్యం విధానంతో లబ్ధి పొందేందుకు ముడుపులు ఇచ్చారని.. ఈ ముడుపులను హవాలా మార్గంలో చెల్లించారని కోర్టుకు వివరించింది. ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో వివరాలు పొందుపరిచామని కోర్టుకు తెలిపింది. సుమారు 30 మంది సాక్షుల వాంగ్మూలం కూడా నమోదు చేశామని వివరించింది. తాజాగా ఈడీ కస్టడీ ముగియడంతో మార్చి 4 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఇవీ చదవండి: