నివర్ తుపాను ప్రభావంతో ఒంగోలులో విస్తారంగా కరుస్తున్న వానలకు పోతురాజు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. 2,3 అడుగుల మేర వరదనీరు చేరటంతో పలుకాలనీల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షం, చలి గాలులు కారణంగా కాలనీ వాసులు కంటి మీద కునుకు లేకుండా గడిపారు. వరద ఉద్ధృతి కారణంగా మార్టూరు మండలం రాజుపాలెం చెక్ పోస్టు వద్ద వాహనాలు నిలిపివేశారు. దర్శి మండలం త్రిపురసుందరీపురం వద్ద రహదారి కోతకు గురైంది. మారళ్ల ఈదరవాగు 12 అడుగుల మేర ప్రవహిస్తుండటంతో... వాహన రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
ఉలవపాడు మండలంలో ఆత్మకూరు కాలువ పొంగి ప్రవహిస్తోంది. అర్ధవీడు మండలంలో కురిసిన వర్షాలకు చాలాచోట్ల పంటనష్టం వాటిల్లింది. జిల్లాలోని 11 తీరప్రాంత మండలాల్లో భీకర గాలులకు....చాలాచోట్ల విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
తుపాను ప్రభావంతో చీరాల, వేటపాలెం, చినగంజాం సముద్రతీరాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. కత్తిపూడి-ఒంగోలు జాతీయరహదారిపై వాహనాలను అనుమతించకుండా...చీరాల వద్ద దారి మళ్లిస్తున్నారు. నాగులుప్పలపాడు వద్ద జాతీయరహదారిపై ప్రమాదకరస్థాయిలో వరదనీరు నిలిచి ఉంది. ఇటువైపు వస్తున్న వాహనాలను పోలీసులు వేరేమార్గంలో పంపిస్తున్నారు.
ఇదీ చదవండి: దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు