APSRTC: ఆర్టీసీలో మెడికల్ అన్‌ఫిట్ అయిన సిబ్బంది కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో వారు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న జీవోను ఆర్టీసీ యాజమాన్యం అమలు చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఆదుకోవాలని మెడికల్ అన్‌ఫిట్ అయిన సిబ్బంది వేడుకుంటున్నారు. ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా 170 మంది మెడికల్ అన్‌ఫిట్ కారణంగా ఉద్యోగాలు వదులుకున్నారు. ఐదేళ్లపైన సర్వీస్ ఉన్నవారికి మెడికల్ గ్రౌండ్స్ క్రింద వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది.
అమలు కానీ జీవో..
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా 170 మంది ఉద్యోగులు ఉన్నారు. ఐదేళ్లకు పైగా సర్వీస్ ఉన్నవారికి పీ.డీ. 19-2015 జీవో ప్రకారం మెడికల్ గ్రౌండ్స్ క్రింద వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా 2015లో ఈ ఉత్తర్వులు అప్పటి ఆర్టీసీ ఎండీ సాంబశివరావు జారీ చేశారు. విధులు నిర్వహించలేని వీరిలో తమ భార్యకో, పిల్లలకో ఉద్యోగం వస్తుందని, కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదని ఆశపడ్డారు.
అయితే దాదాపు ఏడేళ్లయినా ఇంత వరకు వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తిప్పిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బోర్డు సమావేశంలో జీవో అమలుకు తీర్మానం చేయలేదనే సాకుతో, అమలు చేయడంలేదని వాపోతున్నారు. 170 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే తమ పిల్లలను ఉద్యోగులుగా చూడకుండానే సుమారు 30 మంది వరకు మరణించారు. ఉద్యోగాలు రాక, వచ్చే ఫించన్ రాక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వారసులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఆర్టీసీ బోర్డు సమావేశంలో జీవో అమలుకు తీర్మానం చేయలేదనే సాకుతో దీన్ని అమలు చేయడం లేదు. పిల్లలకు ఉద్యోగాలు రాక, వచ్చే పెన్షన్ సరిపోక మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని వారసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: రేపటి సభలో.. అదే చేయబోతున్నా : పవన్ కళ్యాణ్