ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఒంగోలు పట్టణ ప్రజలకు తాగునీరు అందించడానికి ప్రభుత్వం నిధులు అందిస్తుంది. అయితే ఇవి రెండేళ్లుగా నిలిచిపోయాయి. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా.. స్థానిక సంస్థలకు భారంగా మారింది. అత్యవసరమైన ఈ పనులకు నిధులు రాకపోవడంతో చెల్లింపులూ లేకపోయాయి. గత ప్రభుత్వంలో ట్యాంకర్లు నిర్వహించిన గుత్తేదార్లు రెండు మున్సిపాలిటీల్లో ఇప్పటికే తప్పుకొన్నారు. రానున్న వేసవిలో ట్యాంకర్ల సంఖ్య మరింత పెంచాల్సి వస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తప్పవు.
ట్యాంకర్ రానిదే గొంతు తడవదు..
నీటి వనరులు తగ్గిపోయి పుర ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఆ సమస్యను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల నిధిని విడుదల చేస్తుంది. దీంతో ప్రజల దాహార్తి తీర్చడానికి ట్యాంకర్లు ఏర్పాటు చేసి బావులు, బోర్ల నుంచి నీటిని సరఫరా చేస్తారు. జిల్లాలో దీర్ఘకాలంగా నాలుగు పట్టణాల్లో తాగునీటి సమస్య ఉంది. ఒంగోలులో పాక్షికంగా, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరిలో పూర్తిగా ట్యాంకర్ల మీదనే ఆధార పడుతున్నారు. మొత్తం మీద ఏడాదికి రూ.9 కోట్లు ఖర్చవుతుంది. ఈ నాలుగు పట్టణాల్లో ఏడాది పొడవునా ట్యాంకర్లు కొనసాగాల్సిందే.
2018 నుంచి విడుదల లేదు..
2018 నుంచి నిధులు సక్రమంగా అందటం లేదు. ప్రభుత్వం 2019లో రూ.14.26 కోట్లు మంజూరు చేసినట్లు జీవో విడుదల చేసింది. కానీ ఇంతవరకు ఒక్క పైసా విడుదల కాలేదు. జిల్లా ప్రజారోగ్య శాఖ నుంచి రూ.12.84 కోట్లకు బిల్లులు సమర్పించారు. కానీ మంజూరు జాడలేదు. నగర పాలక సంస్థకు మంజూరు చేసిన రూ.2 కోట్ల నిధులు రాకపోవడంతో గుత్తేదార్లు తాము ట్యాంకర్లు నడపలేమని మొరాయించారు. ఈ ఏడాది అవసరాలకు సాధారణ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించారు. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరిలో ఆదాయ వనరులు లేక ప్రభుత్వ గ్రాంటు మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఒంగోలులో రోజువారీ 120 ట్యాంకర్లు 120 ట్రిప్పులు, మార్కాపురంలో 150, కనిగిరిలో 350, గిద్దలూరులో 300 ట్రిప్పులు తిరుగుతున్నాయి.
- ఈ విషయమై ప్రజారోగ్య విభాగం ఒంగోలు ఈఈ సుందరరామి రెడ్డి మాట్లాడుతూ.. తాగునీటి అవసరాలకు మంజూరు చేసిన నిధులను విడుదల చేయాలని కోరుతూ పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యన్నారాయణకు ఇటీవల వినతి పత్రం ఇచ్చామని, త్వరలోనే విడుదల చేస్తామన్నారని చెప్పారు.
ఇదీ చదవండి: