అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ప్రజల నుంచి నిధులు సేకరించాలని పలు జిల్లాల్లో శ్రీ రామ జన్మ భూమి తీర్ధ ట్రస్ట్ సభ్యులు సమావేశాలను నిర్వహించారు. కులమతాలకు అతీతంగా అందర్నీ ఇందులో భాగస్వాములుగా చేయాలని సూచించారు.
చిత్తూరు జిల్లాలో..
చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తిలోని భాజపా కార్యకర్తలతో శ్రీ రామ జన్మభూమి తీర్ధ ట్రస్ట్ సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు. రామ మందిర నిర్మాణం కోసం ప్రజల నుంచి నిధులు సేకరించాలని కోరారు. అందుకోసం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర సమర్పణ అభియాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు. కులమతాలకు అతీతంగా అందర్నీ ఇందులో భాగస్వాములు చేయాలని సూచించారు. అనంతరం పట్టణంలోని మాడ వీధుల్లో రామ నామంతో ర్యాలీ నిర్వహించారు.
ప్రకాశం జిల్లాలో..
అయోధ్య రామ జన్మభూమి నిధి సమర్పణ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలోని చీరాలలో శ్రీ రామ జన్మభూమి తీర్ధ ట్రస్ట్ సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాల్లో ఈ నెల 15 నుంచి నిధి సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. అందుకోసం వివిధ ప్రాంతాల్లో కన్వీనర్లను ఎంపిక చేశామని పేర్కొన్నారు. మొదటి నిధిని శ్రీ రామా నంద సరస్వతి స్వామీజీ చేతుల మీదగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల శాఖ కన్వీనర్ తులసి, కో కన్వీనర్, తదితరులు పాల్గొన్నారు.