ప్రకాశం జిల్లా సింగరాయ కొండ ప్రాంతంలో ఈ ఏడాది విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఈ సమయానికి వ్యవసాయ పనుల్లో తీరికలేకుండా ఉండాల్సిన రైతులు వర్షాలు అనుకూలించక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్టోబర్ మొదటి వారంలో కాస్తంత కురిసిన వానజల్లులకు నేల పదును చేసుకొని, మెట్ట పంటలు, వరి సాగుకు సిద్దమయ్యారు. మిరపనారు కొనుగోలు చేసుకొని నాట్లు పూర్తి చేసారు. మినుము, పెసలు విత్తనాలు కూడా వేసుకున్నారు. వర్షాలు కురిస్తే నాట్లు వేసుకోడానికి సిద్దంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రైతులు నారుమళ్ళు వేసుకున్నారు.
అంతే .. అప్పుడు కురిసిన చినుకే .. తరువాత వర్షాలు కురవకపోవడంతో వేసిన నారుమళ్ళు వృథాగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పాటికే దుక్కులు దున్నుకొని, నాట్లు పూర్తి చేయాల్సి ఉంది. కానీ అనుకున్నట్లుగా వర్షాలు కురవకపోవడంతో పొలాలన్నీ బీళ్ళును తలపిస్తున్నాయి. సింగరాయికొండ వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో సుమారు 6వేల ఎకరాల్లో వరి సాగు కోసం నారుమళ్ళు సిద్దం చేసుకున్నారు. మిరప, అపరాల పంటలకు కూడా నీరు అందక బెట్ట దశకు చేరుకుంటున్నాయని రైతులు వాపోతున్నారు.
వర్షాలు కురిస్తే చెరువుల్లో నీటిని నిల్వ ఉంచుకొని సాగు చేసుకునే అవకాశం ఉండేది. ఎగువున కురిసిన వర్షాలు వల్ల కూడా వాగుల్లో నీటి ప్రవాహం చెరువులకు చేరేది. ఇప్పటికీ చెరువుల్లో చుక్కనీరు చేరలేదు. వేసవి కాలంలో చెరువుల్లో పూడిక తీసి, నీటి నిల్వలలకు అనుకూలంగా ఉంచుకున్నా.. వర్షాలు కురవక నీరు చేరలేదు. ఈ ప్రాంతానికి ప్రధాన జలవనరు మన్నేరు కాలువ పూర్తిగా ఎండిపోయింది.
వేలాది ఎకరాలు భూములు, వందలాది గ్రామాల ప్రజలు సాగు, తాగునీటికి ఈ మన్నేరు ఎంతో ఉపకరించేది. పశులకు ఈ కాలవ నీరే ఆధారం. ఈ ఏడాది ఒక్క సారి కూడా ఈ కాలువలో నీటి ప్రవాహం చూడలేదని రైతులు పేర్కొంటున్నారు. ఎగువున ఉన్న రాళ్ళపాడు ప్రాజెక్టు నిండితే, ఈ కాలువ ప్రవాహం ఉండేదని కానీ వర్షాలు లేక ప్రాజెక్టు నిండే పరిస్థితి కనిపించడంలేదని అంటున్నారు. ఇంత పెద్ద వాగులో నీటి జాడ కనారావడంలేదని వీరు పేర్కొంటున్నారు. సాగునీటి వనరుల్లో నీరు చేరకపోడం వల్ల వీటి ఆధారంగా సాగుచేసే భూములు లేక వృథాగా వదిలేశారు. జిల్లాలో పోల్చి చూస్తే సింగరాయి కొండ ప్రాంతంలోనే అత్యల్పవర్షపాతం నమోదైంది.
ఇతర ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదు కావడం, ఎగువున వర్షాలు భారీ వర్షాలు కురవడం వల్ల వాగులు పొంగి ప్రవహించడం, కొన్ని చోట్ల వరదలకు పంట నష్టాలు చూశారు. ఈ ప్రాంతంలో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు కురవక కరవు పరిస్థితులు నెలకొనడం రైతాంగాన్ని కుంగదీస్తుంది. సింగరాయ కొండ మండలంలో అక్టోబర్‌నెల సాధారణ వర్షపాతం 331 మి.మీ. కాగా ఇప్పటివరకూ నమోదైన వర్షపాతం కేవలం 29.6 మి.మీ. మాత్రమే.. కొండెపి మండలం లో 270.1 మి.మీ. కు 38.6మీమీ, గుడ్లూరు 287.3 మి.మీ.లకు 32.4మీమీ, ఉలవపాడు 287మిమీ లకు 22.4 మిమీ.లు, జరుగుమిల్లి 287 .1.లకు 29.8 మి.మీ. లు మాత్రమే వర్షపాతం నమోదయ్యింది. రాష్ట్రమంతా వర్షాలు కుమ్మరిస్తుంటే, తమ ప్రాంతంలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తుందని రైతులు అంటున్నారు.
ఇదీ చదవండి: తిరుమలలో వైభవంగా చంద్రప్రభ వాహన సేవ