ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామానికి చెందిన ఒంటెద్దు పెద్ద పిచ్చి రంగారెడ్డి.. ఓ నిర్వాసిత రైతు. ఆ గ్రామం వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతం అయిన కారణంగా మార్కాపురం పట్టణంలో నివాసం ఉంటున్నారు. పల్లె నుంచి పట్టణానికి వచ్చినా.. ఆయనకు వ్యవసాయంపై ఆసక్తి తగ్గలేదు. ఉద్యాన పంటలైన బత్తాయి, నిమ్మ సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పూర్తిగా ఎండిపోయాయి. కొన్నిరోజుల అలాగే పంట వేయకుండా ఉన్నారు. అనంతరం.. వర్షాభావ పంట సాగు చేయాలని ఆలోచించారు. పుణెకు చెందిన ఓ ప్రేవేట్ కంపెనీని సంప్రదించారు. వారి సలహాలు, మార్కెట్ విషయాలు నచ్చి.. మార్కాపురం మండలం కోమటికుంటలో తనకున్న నాలుగు ఎకరాల పొలంలో సుమారు 3500 కలబంద మొక్కలను సాగు చేశారు. ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకొని బిందు సేద్యం ద్వారా నీటి తడులు అందిస్తున్నారు.
నీటిని అందించకపోయినా ఆరేళ్ళ పాటు పంట సాగుకు ఢోకా లేదని రైతు రంగారెడ్డి చెబుతున్నారు. ఒక్కో మొక్కకున్న కలబంద రెబ్బ.. ప్రస్తుతం అరకిలో నుంచి ఒక కిలో వరకు తూకం వస్తుంది. పంట సమయం పెరిగితే వీటి తూకం పెరుగుతుంది. పుణెకు చెందిన కంపెనీ టన్ను కలబందను 3500 నుంచి 4 వేల వరకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిందని, తద్వారా మార్కెటింగ్‌కు కూడా ఇబ్బంది లేదని రైతు అంటున్నారు. ఎకరాకు సుమారు 40 టన్నుల వరకు దిగుబడి వస్తుందన్నారు.
ప్రతి ఏడాది కలబంద మొక్కల నుంచి రెబ్బలను మాత్రమే కట్ చేసి వాటిని ట్రేలలో ప్యాక్ చేసి ఎగుమతి చేయాల్సి ఉందన్నారు. జ్యూస్, మందులు, సబ్బులతో పాటు పలు రకాల ఔషధాల్లో కలబందను వినియోగించడం వలన మంచి గిరాకీ ఉంటుందన్నారు. ఈ పంటతో రైతుకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు రంగారెడ్డి. ఆయనకు మార్కాపురం ఏడీఏ శేఖర్ బాబు, ఏవో లక్ష్మీనారాయణ నిత్యం ఎప్పటికప్పుడు సాగు వద్దకు వెళ్లి సలహాలు సూచనలు ఇస్తున్నారు.
ఇదీ చదవండి: