ప్రకాశం జిల్లా మంగుమూరుకు చెందిన బోడపాటి బ్రహ్మయ్య వినూత్న విధానంతో తక్కువ స్థలంలోనే ఎక్కువ పంటలను పండిస్తున్నారు. చిన్నతనంలోనే ఈయన పోలియో వ్యాధికి గురయ్యాడు. గతంలోనే కుటుంబంతో ఒంగోలు వచ్చి చిన్నపాటి పనులు చేసిన ఈయన... ప్రస్తుతం వ్యవసాయం వైపు మొగ్గు చూపారు. పట్టణంలోనే ఖాళీగా ఉన్న ఓస్థలంలో వినూత్నంగా పంటలు పండిస్తున్నారు.
డిస్కవరీ ఛానల్ ఎక్కువుగా చూసే ఆయన కొత్త పద్ధతిలో ప్రయోగం చేశారు. తక్కువ స్థలంలోనే కూరగాయల సాగును చేపడుతున్నారు. డ్రమ్ము చుట్టూ 28 బెజ్జాలు పెట్టి, వాటిలో పైపులు అమర్చారు. సేంద్రియంగా తయరుచేసిన ఎరువును, మట్టినీ కలిపి డ్రమ్ము, పైపుల్లో నింపారు. నాలుగు బెజ్జాలకు ఒక రకం చొప్పున మొత్తం ఏడు రకాల కూరగాయల మొక్కలు నాటారు. వీటితో పాటు డ్రమ్ము పైభాగాన 4 తీగరకాల మొక్కలు వేశారు. వాటి తీగరకాలను పందిరికి పాకేలా చూశారు. అంటే ఒక డ్రమ్ములో నాలుగు తీగరకాలు, ఏడు కాయ, ఆకురకాల మొక్కలు నాటుతారు. ఇలా పెద్ద సంఖ్యలో డ్రమ్ములను ఏర్పడు చేసుకొని సాగు చేస్తున్నారు. కేవలం సేంద్రియ పద్ధతిలోనే వీటి సాగు చేస్తున్నారు.
ఆరు ఎకరాల్లో సాగుచేయాల్సిన పంటలు ఒక ఎకరంలో పండేటట్లు బ్రహ్మయ్య చేసిన ఈ ప్రయోగం ఫలితం ఇచ్చింది. పాదు రకాల్లో బీర, కాకర, చిక్కుడు, సొరకాయ పండించగా, డ్రమ్ము చుట్టూ వంకాయి, మిరప, తోటకూర, కొత్తిమీర, బెండ వంటి కూరగాయలు పండిస్తున్నారు. డ్రమ్ముల్లో మట్టి నింపడం దగ్గర నుంచి ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం నీరు పెట్టడం, జీవామృతం వంటివి పిచికారి చేయడం వంటి పనులన్నీ బ్రహ్మయ్య ఒక్కరే చేసుకుంటారు. సేంద్రియ పద్ధతి కాబట్టి పెద్ద ఖర్చు లేకుండానే సాగు చేస్తున్నారు. వైకల్యం ఉన్నా వినూత్న ప్రయోగంతో మంచి ఫలితాలు సాధిస్తున్న బ్రహ్మయ్య ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇదీ చదవండి :