ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధేనువకొండలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ధేనువకొండకు చెందిన జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు(55) ముగ్గురు కుమార్తెల వివాహాల సందర్భంగా చేసిన అప్పులు, పొలంపైన చేసిన బకాయి కలిపి మొత్తం రూ.6 లక్షల వరకు ఉన్నాయి. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను ఇటీవల గ్రామంలోని ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నాడు. ఆ వైద్యునికి కరోనా పాజిటివ్ రావటంతో, అతని వద్ద వైద్యం తీసుకున్నా మరికొంతమందికి కరోనా సోకింది. ఈ క్రమంలో తనకు కరోనా వచ్చిందేమో అన్న భయం, అప్పుల బాధ, అనారోగ్యం సమస్యలతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని భార్య సింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ జేవీవీ నాగేశ్వరరావు తెలిపారు.
ఇదీ చూడండి