ప్రకాశం జిల్లా దొనకొండ- కురిచేడు మధ్య 12.5 కిలోమీటర్ల మేర రెండో రైల్వే ట్రాక్ పనులు పూర్తవడంతో ఆదివారం నుంచి ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే గుంటూరు డివిజన్ పరిధిలోని నల్లపాడు- సాతులూరు (32 కి.మీ), డోన్- పెండేకల్లు- ఎద్దులదొడ్డి (36.6 కి.మీ), గజ్జెలకొండ- దొనకొండ (12.4 కి.మీ) మధ్య మొత్తం 93.5 కి.మీ పనులు పూర్తయ్యాయి. సుదీర్ఘకాలంగా కలగా మారిన ఈ ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. మరోపక్క గుంటూరు నుంచి అనంతపురం జిల్లా గుంతకల్లుకు 401.47 కి.మీ రైల్వే మార్గంలో డబ్లింగ్ (రెండో లైన్), విద్యుదీకరణకు రూ.3,631 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. ఈ మొత్తం వ్యయంలో రైల్వే మంత్రిత్వ శాఖ, రాష్ట్రం చెరిసగం చొప్పున భరించాలన్నది ఒప్పందం. ఈ పనులు కూడా వేగం పుంజుకున్నాయి.
ఇది పూర్తయితే కర్ణాటక, గోవాతో పాటు రాయలసీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రకు నేరుగా, వేగంగా రావడానికి మార్గం సుగమం కానుంది. కొత్తగా ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, డెమో రైళ్లు తిరగనున్నాయి. ప్రస్తుతం విజయవాడ మీదుగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లను గుంటూరు మీదుగానూ నడిపేందుకు వీలు కానుందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్.రాకేశ్ తెలిపారు. ‘ద.మ.రైల్వే చేపట్టిన ప్రధాన ప్రాజెక్టుల్లో ఇదొకటి. ఈ పనులు వేగంగా పూర్తిచేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు’ అని ద.మ.రైల్వే జీఎం గజానన్ మల్య ఓ ప్రకటనలో ప్రస్తుతించారు.
ఇదీ చూడండి: Bramhotsavalu:శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు ముస్తాబు