granite transportation: గ్రానైట్ ఖనిజానికి పేరుగాంచిన ప్రకాశం జిల్లాలో వాటి కటింగ్, పాలిషింగ్ యూనిట్ల యజమానులకు, గనుల శాఖకు పోరు కొనసాగుతోంది. ప్రభుత్వ, గనుల శాఖ తీరుకు నిరసనగా ఇటీవల యూనిట్లు మూసేస్తామని హెచ్చరించిన యజమానులు ఓ మంత్రి హామీతో వెనక్కి తగ్గారు. గనులశాఖ గతంలో ఇచ్చిన తాఖీదుల ఆధారంగా ఇపుడు గ్రానైట్ స్లాబ్స్ తరలించేందుకు అవసరమైన పాస్‌ల జారీ నిలిపేయడంతో మళ్లీ వివాదం రాజుకుంది. కొద్ది నెలల కిందట ప్రభుత్వం అన్ని ఖనిజాలకు కన్సిడరేషన్ మొత్తాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా గ్రానైట్‌కు సీనరేజ్ విలువలో 50 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
దీనివల్ల ముడిరాయి ధర పెరిగింది. విద్యుత్ ఛార్జీలు కూడా పెరగడంతో ఈ నెల 15 నుంచి యూనిట్లు నిలిపేసేందుకు యజమానులు సిద్ధమయ్యారు. ఆ జిల్లా మంత్రి హామీతో యూనిట్లు కొనసాగిస్తున్నారు. తాజాగా ఒంగోలులోని గనులశాఖ అధికారులు జిల్లాలోని దాదాపు 250 యూనిట్లకు చెందిన ఐడీలు నిలిపేసి, మైనింగ్ పాస్‌ల జారీ కూడా ఆపేశారు. గతంలో ఆయా యూనిట్లను తనిఖీలు చేసినప్పుడు ఉల్లంఘనలు గుర్తించి, జరిమానా చెల్లించాలంటూ అధికారులు డిమాండ్ నోటీసులు జారీ చేశారు. ఇలాంటి నోటీసులున్నప్పుడు పాస్‌లు, పర్మిట్లు జారీ చేయకూడదు. రెండు, మూడేళ్లుగా ఈ యూనిట్లకు పాసులు జారీ చేస్తున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన గనులశాఖ అధికారులు.. ఇటువంటి యూనిట్లకు పాస్‌ల జారీ ఆపేశారు. డిమాండ్ నోటీసు ప్రకారం జరిమానా చెల్లించాలని, లేకపోతే గనులశాఖ మంత్రి వద్ద సమీక్షకు దరఖాస్తు చేసి, కనీస మొత్తం చెల్లించాలని సూచించారు.
నిఘా అధికారి బదిలీకి ఒత్తిళ్లు!
మరోవైపు ప్రకాశం జిల్లా గనులశాఖ విజిలెన్స్ అధికారి ఇటీవల వరుసగా పలు గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లను తనిఖీలు చేసి, అందులో ఉల్లంఘనలపై కొత్తగా నోటీసులు జారీకి సిద్ధమయ్యారు. ఆ అధికారిని బదిలీ చేయాలంటూ కొందరు గ్రానైట్ కటింగ్ యూనిట్ల యజమానులు ఓ అమాత్యుణ్ని కోరుతున్నారు. ఆయన్ను బదిలీ చేయనున్నట్లు, ఉత్తరాంధ్రలో పనిచేస్తున్న వేరొకరిని ఆయన స్థానంలో నియమించే వీలున్నట్లు గనులశాఖలో గత వారం ప్రచారం కూడా జరిగింది. ఆ అధికారి నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నారనే కారణంగా ప్రస్తుతానికి బదిలీపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అసలే కొవిడ్ ప్రభావం, పెరిగిన వ్యయాలతో వ్యాపారం లేక అవస్థలు పడుతున్నామని.. ఇప్పుడు గనులశాఖ అధికారుల తీరు మరింత ఇబ్బందికరంగా మారిందని ఆయా యూనిట్ల యజమానులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: DOLLAR SHESHADRI DIED: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత