ప్రకాశం జిల్లాలో అప్పుల బాధతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కారంచేడు మండలం ఆదిపూడిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పేర్ని శ్రీనివాసరావు (45) దగ్గుబాడుకు చెందిన మహిళను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి దగ్గుబాడులోనే ఉంటూ ఏటా అయిదారెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. కొన్నేళ్లుగా సేద్యం కలిసిరాక తీవ్రంగా నష్టపోయారు.
ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా శ్రీనివాసరావు చేతిలో చిల్లిగవ్వ లేక పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. ఊళ్లో ఉన్న స్థలం అమ్మేందుకు సిద్ధమైనా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో నాలుగు రోజులుగా మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆదిపూడి - కారంచేడు రహదారిలో శ్రీనివాసరావు పడి ఉండడాన్ని గమనించిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై అహ్మద్‌జానీ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గత ఏడాది మిర్చి సాగు చేయడంతో తీవ్రంగా నష్టపోయినట్లు బంధువులు తెలిపారు. శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇదీ చదవండి : సీఎం కుటుంబంపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో.. వ్యక్తి అరెస్ట్!