ప్రకాశంజిల్లా సంతమాగులూరు గ్రామానికి చెందిన చెన్నుపల్లి సైదాలక్ష్మీ.. ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చినట్లు దర్శి డీఎస్పీ కె.ప్రకాశరావు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ వెల్లడించారు. గ్రామానికి చెందిన సైదాలక్ష్మి కూలీ పనులు చేస్తుంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన నల్లగంగుల వెంకటరెడ్డి(ఆటో డ్రైవర్)తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త శ్రీనివాసరావు.. వెంకటరెడ్డిని మందలించాడు. ఈ విషయమై వెంకటరెడ్డి, సైదాలక్ష్మీ ఇద్దరు కలిసి శ్రీనివాసరావును అడ్డు తొలగించుకోవాలనుకున్నారు.
పథకం ప్రకారం..
ఈ నెల 25 రాత్రి మద్యం మత్తులో ఉన్న శ్రీనివాసరావు.. భార్యతో గొడవ పడి పడుకున్నాడు. పథకం ప్రకారం అర్ధరాత్రి సమయంలో సైదా లక్ష్మీ, ప్రియుడు వెంకటరెడ్డి కలిసి భర్త గొంతు నులిమి చంపేశారు. సైదాలక్ష్మి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.
ఫిర్యాదులో వెలుగులోకి...
మృతుడి తమ్ముడు వీరయ్య ఈ ఘటనపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా గొంతు నులిమి చంపినట్లు నివేదికలో తెలింది. దీంతో భార్యను అదుపులోకి తీసుకొని విచారించగా తానే ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసినట్లు ఒప్పుకొంది. సైదాలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని.. పరారీలో ఉన్న వెంకటరెడ్డి కోసం గాలిస్తున్నట్లు దర్శి డీఎస్పీ కె.ప్రకాశరావు వివరించారు.
ఇదీ చదవండి