ఒంగోలులోని ట్రంకు రోడ్డు, కర్నూలురోడ్డు, గాంధీరోడ్డు, మంగమూరు రోడ్డుతో పాటు అన్ని ప్రాంతాల్లోని దుకాణాలను మధ్యాహ్నం మూసివేశారు. ప్రధాన వాణిజ్య సముదాయం బాపూజీ మార్కెట్ కాంప్లెక్సులోనూ లావాదేవీలను నిలిపివేశారు. కేవలం ఔషధ దుకాణాలు తెరిచారు. ప్రకాశం బస్‌స్టేసన్ బోసిపోయి కనిపించింది. కర్ఫ్యూ అమలు తీరుతెన్నులను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండు, అద్దంకి బస్టాండు, కొత్తపట్నం, రైల్వే స్టేషన్, చర్చి సెంటర్, వీఐపీ రోడ్డు, మంగమూరు రోడ్డు ప్రాంతాల మీదుగా జిల్లా పోలీసు కార్యాలయం వరకు ద్విచక్ర వాహనంపై ఆయన పర్యటించారు. ఒంగోలు నగర డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి.ప్రసాద్, సీఐ లు సి.హెచ్.సీతారామయ్య, ఎం.రాజేష్, ఎ.శివరామకృష్ణారెడ్డిలకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నగరంలోకి రాకపోకలను అనుమతించవద్దని, అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, దురుసుగా ప్రవర్తించకూడదని హితవు పలికారు. తొలిరోజు కర్ఫ్యూ ప్రభావం ఒంగోలులో పెద్దగా కనిపించలేదు. రహదారులు వాహనాలతో రద్దీగానే కనిపించాయి. ఎస్పీ పర్యటన సాగిన ప్రాంతాల్లో ఆంక్షల ప్రభావం కనిపించినా మిగిలిన ప్రాంతాల్లో మాత్రం యథావిధిగానే పరిస్థితి నెలకొంది.
రోడ్డెక్కింది 205 బస్సులే
ఒంగోలు నేరవిభాగం, ఒంగోలు అర్బన్(సంతనూతలపాడు), న్యూస్‌టుడే: జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ సర్వీసులు తిరిగాయి. మొత్తం 702 సర్వీసులకు గాను బుధవారం కేవలం 205 వాహనాలు రోడ్డెక్కాయి. ఇప్పటికే అంతర్ రాష్ట్రాలైన కర్ణాటక, చెన్నై, హైదరాబాద్‌లకు పూర్తిగా బస్సులను అధికారులు నిలిపివేశారు. పాక్షిక కర్ఫ్యూతో గ్రామీణ ప్రాంతాల సర్వీసులు సైతం దాదాపు నిలిచిపోయాయి. వీటిలో కూడా కేవలం 30 శాతం కంటే తక్కువ మంది ప్రయాణించారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఖాళీగా దర్శనమిచ్చింది. లోపలి దుకాణాలు మూసివేశారు. వివిధ ప్రాంతాల నుంచి పనులపై జిల్లా కేంద్రానికి వచ్చిన గ్రామీణ ప్రజలు ఇబ్బందిపడ్డారు.
రూ.600 ఇస్తేనే సింగరాయకొండకు..
ఈయన పేరు సుబ్బయ్య(75). చక్కెర వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం తన కోడలిని వెంటబెట్టుకొని ఒంగోలు వచ్చారు. స్థానిక సుందరయ్య భవన్ రోడ్డులోని ఒక వైద్యశాలలో చూపించుకొని బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది. ఎర్రటి ఎండలో ఆర్టీసీ బస్టాండుకు చేరారు. రేపు ఉదయం ఆరు గంటల తర్వాతనే బస్సులు ఉంటాయంటూ అక్కడి పోలీసు సిబ్బంది అనుమతించలేదు. బయట ఆటోలను సంప్రదించి సింగరాయకొండ వెళ్లాలని కోరారు. రూ.600 ఇస్తేనే తీసుకెళ్తామంటూ సమాధానం రావడంతో అంత మొత్తం చేతిలో లేక బయట దుకాణాల వద్ద కూలబడిపోయారా మామాకోడళ్లు. చివరకు స్వగ్రామంలోని బంధువులకు కబురు పంపారు. వాహనం పంపి తమను తీసుకెళ్లాలని కోరారు.
బస్సులు లేవని తెలియక
కందుకూరుకు చెందిన వృద్ధుడు మాలకొండయ్య దంపతులు ఒంగోలులోని ఓ వైద్యశాలకు వచ్చారు. తీరా అక్కడ చూపించుకొని బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. ఆర్టీసీ సర్వీసు నిలిపివేశారని తెలియక బస్టాండ్‌కు చేరుకున్నారు. కర్ఫ్యూ ఉందని.. ఇక్కడ ఉండటానికి వీలులేదని పోలీసులు బయటకు పంపించివేశారు.
ఇదీ చదవండీ… 'నాకు ఊపిరి అందట్లేదు... నా భార్య జాగ్రత్త !'