కొవిడ్ పరీక్షల కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తులు.. భయంతో పరీక్షల కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. అనుకున్న స్థాయిలో కేంద్రాలు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. పరీక్షల కోసం ఎక్కువ మంది రిమ్స్ సర్వజన ఆసుపత్రికి వెళుతున్నారు. అయితే... అక్కడ పాజిటివ్ కేసులు వచ్చి, ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చేవారు.. పరీక్షలు చేయించుకునేందుకు వచ్చేవారు ఎక్కువవుతున్న కారణంగా పరిస్థితి ఇబ్బందిగా మారింది.
సంజీవిని బస్సు వద్ద జనం బారులు
రిమ్స్ వద్ద ఉన్న మినీ స్టేడియం సమీపంలో.. సంజీవిని బస్సులో ఈ పరీక్షలు నిర్వహిస్తుండటంతో అక్కడ జనం బారులు తీరుతున్నారు. నడిరోడ్డుమీద, తీవ్రమైన ఎండలో పరీక్షల కోసం వేచి చూడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు.
ఫలితాలు ఆలస్యమవటంతో..
రెండు రోజుల నుంచి వీఆర్‌డిఎల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొద్ది మందికి మాత్రం రాపిడ్ పరీక్షలు నిర్వహించి, వెంటనే ఫలితాలు అందిస్తున్నారు. ఎక్కువ మంది రేహిడ్ పరీక్షలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వీఆర్‌డిఎల్ పరీక్షల ఫలితాలు.. రెండు, మూడు రోజులకు వస్తున్నాయని, అంతవరకూ వైద్యం ప్రారంభించాలో వద్దో తెలీని పరిస్థితి ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పరీక్షలు చేయించుకొని ఫలితాలు వచ్చేవరకూ బయట తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గతంలో అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ పరీక్షల కోసం ప్రత్యే కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీటిలో చాలా వరకూ తగ్గించటంతో.. పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
ఇదీ చదవండి:
కాబోయే అమ్మకు కోవిడ్ సెగ.. వసతి గృహంలో గర్భిణులకు పాజిటివ్..!