ప్రకాశం జిల్లాకు ప్రధాన ఆదాయ వనరు, ఎంతోమందికి ఉపాధి అందించే గ్రానైట్ పరిశ్రమకు ఏడాది నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో విజిలెన్స్ దాడులు, ప్రభుత్వ విధానాల కారణంగా క్వారీయింగ్ సరిగ్గా జరగలేదు. ఇంతలో కరోనా రావటంతో లాక్ డౌన్ ప్రకటించారు. ఇది పరిశ్రమకు మరింత ఇబ్బందిగా మారింది. జిల్లా నుంచి గ్రానైట్ ప్రధానంగా చైనాకు ఎగుమతి అవుతుంది. 70 శాతం మార్కెట్ ఆ దేశం మీదే ఆధారపడి ఉంది. అయితే కరోనా మహమ్మారి ఆ దేశంలోనే పుట్టడం, క్రమంగా మన దేశానికి పాకటంతో ఎగుమతులు నిలిచిపోయాయి.
జిల్లాలోని చీమకుర్తిలో ఉన్న గెలాక్సీ, బల్లికురవలోని స్టీల్ గ్రే, గురిజేపల్లి, కనిగిరి ప్రాంతాల్లో బ్లాక్ గ్రానైట్‌ను వెలికితీస్తారు. ఇక్కడనుంచి మొదటిరకం గ్రానైట్ బండలు కొంత, పాలిష్ చేసిన పలకలు కొంత ఎగుమతి చేస్తారు. ఏడాది ప్రారంభంలో ఈ క్వారీలపై విజిలెన్స్ దాడులు జరిగాయి. దాంతో క్వారీయింగ్ కొంత తగ్గింది. దీనికితోడు కొవిడ్‌తో వ్యాపారం పూర్తిగా సన్నగిల్లింది. సాధారణంగా ఒక్కో క్వారీ నుంచి నెలకు 2వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను తీస్తారు. అయితే అది ఇప్పుడు భారీగా తగ్గింది. క్వారీల్లో పనిచేసే ఇతర రాష్ట్రాల కూలీలు స్వగ్రామాలకు వెళ్లటంతో పని సాగడంలేదు.
ఫిబ్రవరిలో గెలాక్సీ, బ్లాక్, కలర్ బ్లాక్ వెరసి లక్ష క్యూబిక్ మీటర్లు, మార్చిలో 60 వేలు, మే నెలలో 53 వేలు, జూన్‌లో 65 వేల క్యూబిక్ మీటర్ల రాయి ఎగుమతి అయ్యింది.. ఏప్రిల్ నెలలో అసలు ఎగుమతి జరగలేదు. ప్రస్తుతం జరుగుతున్నవి కూడా గతంలో వెలికితీసిన రాళ్లే. రవాణా, ఎగుమతులపై ఆంక్షల సడలింపులు ఇవ్వటంతో ఎగుమతులు అనుకూలంగా ఉన్నా.. కార్మికులు లేకపోవడం ప్రతిబంధకంగా మారింది. కారణాలు ఏమైనా గ్రానైట్ ఎగుమతి వ్యాపారం ఈ ఏడాది సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఇవీ చదవండి...