నిన్నమొన్నటి వరకు ఆస్తి పన్నుల వసూళ్లకు ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీ అధికారులు తలలు పట్టుకునేవారు. ఆటోలు, మైకుల ద్వారా, కరపత్రాలు పంచి... ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించి పన్నులు కట్టించుకునేవాళ్ళు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ప్రజలే స్వచ్చందంగా ముందుకొచ్చి ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారు.
ఏప్రిల్ నెలాఖరుతోనే పన్ను చెల్లింపు గడువు ముగిసినా లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది ఆస్తి పన్నులు కట్టలేకపోయారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు మొత్తం ఆస్తి పన్ను చెల్లిస్తే... 5 శాతం రాయితీ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సర్కారు మరో అవకాశం ఇచ్చి జూన్ నెలాఖరు వరకు పొడిగించింది. దీనివల్ల ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.2.41 కోట్లు పన్నులు వసూలయ్యాయని చీరాల మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ నెలాఖరు వరకు గడువు ఉండటంతో వసూళ్ల శాతం ఇంకా పెరుగుతుందన్నారు. ఈ నెలాఖరు వరకు ఉన్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రజలకు సూచించారు.
ఇదీ చూడండి: 800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం.. నలుగురు అరెస్టు