Chandrababu Gundlakamma Project Tour: పులివెందులలో సీఎం జగన్‌కు ఓటమి తప్పదని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఇది దేవుడు తిరగరాసిన స్క్రిప్టుగా ఆయన అభివర్ణించారు. రాజకీయ దుర్మార్గుల్ని మట్టుపెట్టడంలో తన ఉగ్రరూపం ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించారు. పోలీసులు కూడా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని సూచించారు. వరద బాధితులను ఇన్ని రోజులు పట్టించుకోని ముఖ్యమంత్రి.. తన విమర్శలతో పరామర్శకు బయలుదేరారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శన: సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టును టీడీపీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. కొట్టుకుపోయిన గేటుతో సహా మిగిలిన గేట్ల అధ్వాన్న స్థితిని ఆయన మీడియాకు చూపించారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గేటు కొట్టుకుపోయి ఏడాది దాటినా కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్తది పెట్టడం చేతగాని సీఎం.. 3 రాజధానులు కడతారా అని ప్రశ్నించారు. జగన్ అసమర్థత పులివెందుల ప్రజలకు కూడా అర్థం కావడంతో.. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఓడించాలనే నిర్ణయానికి వచ్చారని చెప్పారు. ఇతను చేతకాని దద్దమ్మ అని పులివెందుల ప్రజలకు కూడా తెలిసిపోయిదన్నారు.
"ఈ ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వం. అవినీతి ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన గేటు ఏటిలో ఉంది. గేటు పెట్టడానికే సంవత్సరం పడుతోంది. ఒక గేటు పెట్టలేని వ్యక్తి.. ఆయన మూడు రాజధానులు కడతారంటా." - చంద్రబాబు
సాగునీటి రంగాన్ని అప్పగిస్తే.. సినిమాల గురించి మాట్లాడుతున్నారు: సాగునీటి ప్రాజెక్టులు, నీటిపారుదల రంగాన్ని అంబటి రాంబాబుకు అప్పగిస్తే.. సినిమాలు, కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సాగునీటి రంగాన్ని జగన్ నిర్లక్ష్యం చేయడంతో.. తెలంగాణ కంటే మన రాష్ట్రంలో వరి ఉత్పత్తి భారీగా తగ్గిపోయిందని చంద్రబాబు అన్నారు. ఇన్ని రోజుల తర్వాత జగన్‌కు వరద బాధితులు గుర్తుకొచ్చారా అని చంద్రబాబు ప్రశ్నించారు.
"గేట్లు పెట్టలేడు గాని.. బ్రో సినిమా గురించి మాట్లాడుతాడు. నోరు ఉందని పారేసుకుంటే.. ప్రజలు నిన్ను అభినందించలేరు. గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా." - చంద్రబాబు
పోలవరనికి చంద్రబాబు: రాజకీయ దుర్మార్గుల్ని మట్టుపెట్టడంలో తన ఉగ్రరూపం ఎలా ఉంటుందో చూపిస్తానని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రం, పిల్లలు, మన భవిష్యత్తు గురించి పోలీసులు కూడా ఆలోచించాలని సూచించారు. నేరస్థుడు చెప్పినట్లు చేస్తూ రాష్ట్ర వినాశనంలో భాగం కావద్దన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్యటన తర్వాత ఏలూరు చేరుకున్న చంద్రబాబు.. ఈరోజు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ప్రభుత్వం, ఈఎన్‌సీ అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా.. పర్యటన జరిగి తీరుతుందని తెలుగుదేశం నాయకులు స్పష్టం చేశారు.
Chandrababu Fires on CM Jagan: 'వైనాట్.. పులివెందుల'.. సీఎం ఇలాకాలో చంద్రబాబు గర్జన!