ప్రకాశం జిల్లా చందవరంలోని బౌద్ధ ఆరామం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో శాతవాహన రాజవంశీయులు నిర్మించారు. చందవరం బౌద్ధ ఆరామం వారణాసి నుంచి కంచి వెళ్లే బౌద్ధ సన్యాసులకు విశ్రాంతి ప్రదేశంగా ఉపయోగించేవారు. బౌద్ధ స్థూపం ఉన్న ఈ కొండను "సింగరకొండ"గా పిలుస్తారు స్థానికులు. ఈ బౌద్ధ స్థూపం చుట్టుకొలత 120అడుగుల, ఎత్తు 30 అడుగులు.
స్థూపంలో ధర్మచక్రం, హిందూయిజం, జైనిజం, బుద్దిజం కలగలసి ఉన్నాయి. 1964లో డాక్టర్ వేలూరి కృష్ణశాస్త్రి కనుగొన్నాడు. 2000 సంవత్సరంలో చందవరం బౌద్ధ ఆరామ ప్రదేశంలో ఉన్న కొన్ని కళాఖండాలు దొంగతనానికి గురవ్వగా...మరికొన్ని కళాఖండాలను గ్రామస్థులు సేకరించి చందవరం పంచాయితీ కార్యాలయంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఈ ఆరామక్షేత్రం శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని పునరుద్దరించాలని స్థానికులు కోరుతున్నారు.
గత ప్రభుత్వం కొంతనిధులు కేటాయించి మెరుగులు దిద్దింది. అప్పట్లో కొన్ని ప్రాంతాల నుంచి పర్యటకులు వచ్చి సందర్శించడం జరిగినా... మళ్లీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికారులు మాత్రం నెల నెల జీతాలు తీసుకుంటున్నారే తప్ప ఈ ప్రాంతానికి వచ్చి బౌద్ధ ఆరామక్షేత్రాన్ని పరిరక్షించటం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరామక్షేత్రాన్ని పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు సైతం అభివృద్ధికి నోచుకుంటాయని గ్రామ ప్రజలు అంటున్నారు.