BJP Concern on Atmakur Incident: ఆత్మకూరులో భాజపా నంద్యాల అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. ఘటన జరిగి 24 గంటలు గడిచినా సీఎం జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన సోము వీర్రాజు... ఆత్మకూరు ఘటనలో పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు.
ప్రభుత్వం ఏం చెబితే పోలీసులు అదే అనుసరిస్తున్నారు..
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఆరోపించారు. పోలీసులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరించడం వల్లే దారుణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని.. విజయవాడ ధర్నాచౌక్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో అన్నారు. చట్టం, నిబంధనలు అనేవి పాటించే వారే కనిపించడం లేదని అన్నారు. పోలీసులు ప్రభుత్వం ఏం చెబితే అదే అనుసరిస్తున్నారని తెలిపారు. ఆత్మకూరులో జరిగిన ఘటనపై ఇప్పటివరకు పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. భాజపా నేతలకు అనుమతి ఇవ్వని పోలీసులు.. మంత్రికి ఎలా ఇచ్చారని అన్నారు. పోలీసులను తీసుకుని వెళ్లిన శ్రీకాంత్ రెడ్డిపై వాళ్ల సమక్షంలోనే దాడి చేశారని అన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసంమే ఇదంతా..
పోలీసులు ఉండగానే గొడవ జరగడం.. గాయపడిన భాజపా నేతను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని భాజపా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జరిగిన ఘటనను భాజపా చాలా సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. భాజపా కేంద్ర నాయకత్వం కూడా ఈ అంశాలను పరిశీలిస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి: Tension at Atmakur: భాజపా నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు