ప్రకాశం జిల్లాలో సామాన్యులకు ఇసుక లభించడం గగనంగా మారింది. దీనిని ఆసరా చేసుకొని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తూ.. ఎక్కడపడితే అక్కడ అనుమతుల్లేకుండానే ఇసుక దోపిడీ సాగిస్తూ..లక్షల్లో ఆర్జిస్తున్నారు. పట్టపగలే ఈ దందా కొనసాగిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
మార్కాపురం ప్రాంతంలో లాక్‌డౌన్ సడలింపులతో భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయితే ప్రభుత్వం సరఫరా చేసే ఇసుకపై ఆశలు వదులుకున్న కొందరు ఫ్లోరింగ్, కట్టుబడికి గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాలు, పొలాల నుంచి లభించే ఇసుకపై ఆధారపడుతున్నారు. పైగా తక్కువ ధరకూ లభిస్తుండడంతో డిమాండ్ ఏర్పడింది. అధికార పార్టీ నాయకుల అండదండలతో అక్రమార్కులు నగదుగా మార్చుకుంటున్నారన్న అరోపణలు వినిపిస్తున్నాయి.
మార్కాపురం మండలం మాల్యవంతునిపాడు, కొండేపల్లి, రామచంద్రాపురం గ్రామాల్లోని పొలాలు, గుండ్లకమ్మ నది పరివాహకంలో తవ్వకాలు సాగిస్తున్నారు. వచ్చే మట్టిని జల్లెడ పట్టించి ఇసుకను రాబడుతున్నారు. రోజుకు 20 నుంచి 25 వరకు వచ్చే ట్రాక్టరు ట్రక్కుల ఇసుకను మార్కాపురం పట్టణంతోపాటు మండలం, తర్లుపాడు, పెద్దారవీడు మండలాల్లో రూ.3000-3500 చొప్పున విక్రయిస్తూ పెట్టుబడిలేని వ్యాపారంగా మార్చుకున్నారు.
అయితే.. తమ దృష్టికి ఇలాంటిదేమీ రాలేదని, అక్రమార్కులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమమని ఎస్‌ఈబీ సూపరింటెండెంట్ ఎ.ఆవులయ్య, తహసీల్దార్ విద్యాసాగరుడు తెలిపారు. మాల్యవంతునిపాడులో ఇసుక తవ్వకాలకు సంబంధించి గ్రామ సచివాలయానికి ఒక్క దరఖాస్తూ రాలేదని పంచాయతీ కార్యదర్శి మహేశ్వరరెడ్డి చెప్పారు.
ఇవీ చదవండి: