ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి చెందిన శింగరకొండ తిరునాళ్లు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున్న ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తోంది.
ప్రకాశం జిల్లా శింగరకొండ క్షేత్రం.. మహిమాన్వితుడైన ప్రసన్నాంజనేయస్వామి కొలువైన దివ్యధామం. దేవస్థాన గరుడ స్తంభంపై చెక్కిన 1443నాటి శిలా శాసనాన్ని బట్టి.. ఈ ప్రాంతాన్ని దేవరాయలు అనే రాజు పరిపాలించాడని.. శింగన్న అనే భక్తుని పేరు మీదుగా ఈ కొండకు శింగరకొండ అనే నామకరణం వచ్చిందని చెబుతారు. 250 ఏళ్ల క్రితం కొండపైనున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట జరుగుతుండగా.. కొండ మీద తేజోవంతుడైన మహా యోగిశ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని తెచ్చి స్వయంగా ప్రతిష్టించినట్లు చెబుతారు.
శింగరకొండ క్షేత్రంలో 67వ వార్షిక ఉత్సవాలు రేపటి నుంచి 3 రోజులపాటు వైభవంగా జరగనున్నాయి. ధ్వజస్తంభ దాత మేదరమెట్ల శంకరారెడ్డి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా.. ధ్వజపతాక పూజ, ధ్వజారోహణ చేయడంతో తిరునాళ్లు ప్రారంభం అవుతాయి. రెండోరోజు రుద్రసహిత మన్యసూక్త ఏకాదశ వారాభిషేకం, స్వామి అలంకరణ ఉంటాయి. మూడో రోజు ఉదయం ఐదున్నర నుంచి స్వామి దివ్య దర్శనం ప్రారంభమవుతుంది. ప్రధాన తిరునాళ్ల మహోత్సవం 18 ఉదయం ఐదు గంటల నుండి 19 వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది.
400 మందితో బందోబస్తు..
తిరునాళ్లకు పోలీస్ శాఖ 400 మందితో బందోబస్తు ఏర్పాటు చేశాం. అశ్లీల కార్యక్రమాలకు తావు లేకుండా ప్రభల ఏర్పాటు కమిటీతో చర్చలు జరిపాం. ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించాం. శింగరకొండ తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. - మలికా గార్గ్, జిల్లా ఎస్పీ
ఇదీ చదవండి: TDP on YSRCP: 'కల్తీసారా తాగి 26 మంది చనిపోతే.. ప్రభుత్వంలో కనీస చలనం లేదు'