Nara Lokesh Yuvagalam Mahapadayatra : జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తొలి ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. అధికార పార్టీ నేతల అవరోధాలు, అడ్డంకుల్ని దాటుకుంటూ ముందుకు సాగుతున్న లోకేశ్.. నేడు సింహపురి జిల్లాలోకి ప్రవేశించనున్నారు. సీమలో.. దిగ్విజయంగా సాగిన లోకేశ్ యాత్ర.. కార్యకర్తల్లో జోష్ నింపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45రోజులు పాటు 577 కిలో మీటర్లు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 23రోజుల 303 కిలో మీటర్లు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40రోజులు 507 కిలో మీటర్లు, ఉమ్మడి కడప జిల్లాలో 16రోజులు 200 కిలో మీటర్ల మేర యాత్ర కొనసాగింది. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో, అనంతపురంలో 9, కడప జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. మొత్తంగా రాయలసీమలో 44 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 108 మండలాలు, 943 గ్రామాల మీదుగా యువనేత పాదయాత్ర కొనసాగింది.
మిషన్ రాయలసీమ ప్రకటన.. 124రోజుల సుదీర్ఘ పాదయాత్రలో రాయలసీమలో వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్న నారా లోకేశ్.. వారి కష్టాలు తెలుసుకున్నారు. అందుకు పరిష్కారంగా ఈ నెల 7వ తేదీన కడపలో “మిషన్ రాయలసీమ” పేరిట అభివృద్ధి ప్రణాళికను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో రాయలసీమకు తాము ఏం చేస్తామనేది వెల్లడించారు. రెండు, మూడు అనివార్య సందర్భాల్లో మినహా ఎండా, వానలను సైతం లెక్కచేయకుండా యువనేత లోకేశ్ సాగిస్తున్న పాదయాత్ర.. పసుపు శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.
జగన్ సొంత జిల్లాలో.. ప్రతి వంద కిలోమీటర్లకు ఓ హామీ ఇస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించడం, ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న బహిరంగసభల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేల అవినీతిని క్షేత్రస్థాయిలో ఎండగట్టడం, టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని వైఫల్యాలపై సెల్ఫీ ఛాలెంజ్‌లు విసరడం వంటివి జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయాయి. రాయలసీమ ప్రజల కన్నీళ్లు తుడిచి రుణం తీర్చుకుంటానన్న యువనేత లోకేశ్‌కు సీమప్రజలు జేజేలు పలికారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో యువగళం పాదయాత్ర 16రోజులపాటు హోరెత్తించింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 200 కిలో మీటర్ల మేర నిర్వహించిన యువనేత పాదయాత్రకు పెద్దఎత్తున ప్రజలు హాజరై తమ సమస్యలు చెప్పుకొన్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, కడప, రాజంపేట, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది.
పోలీసులు కేసులతో ఇబ్బందులు సృష్టించినా.. కుప్పం నుంచి తంబళ్ల నియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున... సగటున రెండురోజులకు ఒక కేసు చొప్పున మొత్తం 25 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇందులో లోకేశ్‌పై మూడు కేసులు నమోదు చేశారు. ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్‌తో సహా అన్నింటినీ సీజ్ చేసిన పోలీసులు.. పీలేరులో బాణాసంచా కాల్చారని అక్కడి ఇన్చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మరికొందరిపై కేసులు నమోదు చేశారు. పాదయాత్ర దారిలో ప్రొద్దుటూరులో కోడిగుడ్లు వేయించడం, పత్తికొండ, కర్నూలు వంటి ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ బ్యాచ్ యువనేతను అడ్డుకునేందుకు నల్లజెండాలతో విఫలయత్నం చేయగా, అందుకు లోకేశ్ ధీటుగా సమాధానమిచ్చి ముందుకు కదిలారు.
వాటర్ గ్రిడ్ ప్రకటన... మిషన్ రాయలసీమలో భాగంగా సీమ జిల్లాలకు లోకేశ్ ప్రకటించిన హామీల్లో ప్రధానమైనవి పరిశీలిస్తే.. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా సీమలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత తాగునీరుతో పాటు మామిడి, బొప్పాయి, దానిమ్మ, చీని, అరటి తదితర పంటలు వేసేందుకు ప్రోత్సాహం ప్రకటించారు. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్, హర్టికల్చర్ హబ్‌గా రాయలసీమను మారుస్తానన్నారు. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లను వినియోగించుకొని పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయనున్నట్లు ప్రకటించారు. రాయలసీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి.. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలకు క్రీడాకారులను పంపే లక్ష్యాన్ని నిర్థేశించుకున్నట్లు వెల్లడించారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, టైగర్ ఏకో టూరిజం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. 124రోజుల పాదయాత్రలో వివిధ వర్గాలతో 103 సమావేశాలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చాక తాము ఏం చేయబోతున్నారో స్పష్టం చేశారు.
రాయలసీమలో యువగళం జైత్రయాత్రను పూర్తి చేసుకుని ఆత్మకూరు నియోజకవర్గంలోని కదిరినాయుడుపాలెం వద్ద.. పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టనుంది. 14న చుంచులూరు వద్ద.. 1600కిలోమీటర్ల మైలురాయి చేరుకోనుంది. పాదయాత్ర ఏర్పాట్లను.. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు.
ఇవీ చదవండి: