రాజకీయాల్లోకి రాకముందు వాళ్ల నాన్న ఇచ్చిన ఆస్తి కంటే ఒక్క పైసా ఎక్కువ ఉన్నా, భగవంతుడు తనని శిక్షిస్తాడని అనిల్ అన్నారు. లోకేశ్.. ఎక్కడకి రమ్మన్నా వచ్చి.. ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఇస్కాన్ సిటీలో పద్దెనిమిదిన్నర ఎకరాలు ఉంటే.. ప్రస్తుతం అమ్మి వేసి మూడు ముక్కలుగా ఎకరా మాత్రమే ఉందని.. ఆరోపణలు చేసేటప్పుడు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్న మూడు ఎకరాలని అమ్మేశానని.. టేక్కేమిట్ట స్థలం కూడా అమ్మి రాజకీయాలు చేశా అని వ్యాఖ్యానించారు.
"నువ్వు చేసిన ఏ ఆరోపణకైనా చర్చకు సిద్ధం. నువ్వు రా అంటే అరగంటలో వస్తా. రెండు గంటల వరకు సమయం ఇస్తా. నువ్వు ఏ టైం చెప్పినా నిమిషం లేటు కాకుండా వస్తా. చర్చకు కావాలన్నా వస్తా.. యుద్ధానికి రమ్మనా వస్తా. నువ్వు 10వేల మందిని తీసుకొచ్చినా.. నేను వందమందితో వస్తా. యుద్ధం ఎలా ఉంటది.. భయం ఎలా ఉంటదో చూపిస్తా. ఇస్కాన్ సిటీలో నా కుటుంబానికి రాజకీయాల్లోకి వచ్చేముందు 18న్నర ఎకరాలు ఉంది. ఈరోజు మూడుముక్కల ఎకరం ఉంది. మా నాన్న ఇచ్చిన ఆస్తి కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేస్తా"-అనిల్‌కుమార్ యాదవ్, నెల్లూరు ఎమ్మెల్యే
తన తమ్ముడు అశ్విన్ మొదటి నుంచి ఒక హాస్పిటల్లో షేర్ హోల్డర్‌గా ఉన్నాడని.. గంజాయి తరలించే ముఠాకి టీడీపీ నేతలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని ఆరోపించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలని సాక్షాత్తు నెల్లూరు ఇంచార్జ్ తనకు 50 లక్షల రూపాయలు పంపితే వెనక్కి పంపానని.. దీనిపై ఇప్పటి వరకు ఆ పెద్దమనిషి నోరు విప్పి మాట్లాడలేదని మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు పోతుంటే హైదరాబాదుకు వెళ్లి దాక్కున్న నారాయణ, నేడు నెల్లూరుకు రావడానికి సిగ్గుండాలని విమర్శించారు. ఇలాంటి విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తి గొప్పవాడని చెప్పటానికి లోకేశ్‌కు సిగ్గుండాలని అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. క్రికెట్ బెట్టింగ్ కేసు ఉన్న వారిని పక్కన పెట్టుకుని తనను నిందించటం సిగ్గుచేటన్నారు. జగన్‌ను విమర్శించే స్థాయి లోకేశ్‌కు లేదన్నారు.