కరోనా... ఈ పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి నివారణ చర్యల్లో మహిళలు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వ్యాప్తి కట్టడికి నిత్యం శ్రమిస్తున్నారు. వివిధ విభాగాల్లో ఉన్న మహిళలు ఈ సేవల్లో 2 నెలల నుంచి పోరాటం చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఎక్కువమంది మహిళలే ఉన్నారు. వీరంతా ప్రస్తుతం కొవిడ్ -19 మహమ్మారిని తరిమే యుద్ధంలో ఉన్నారు. పల్లె నుంచి పట్టణం వరకు వీరిదే ప్రముఖ పాత్ర. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, వైద్యులు, ఏఎన్‌మ్‌లు, ఆశా కార్యకర్తలు ప్రతిపల్లెల్లో పనిచేస్తున్నారు. గ్రామ వాలంటీర్లలో 60 శాతం వరకు ఉన్నారు. కరోనా నివారణ చర్యలతో పాటు గృహ నిర్బంధంలో ఉన్న వారికి సేవలందిస్తున్నారు. ఇంటింటికీ నగదు పంపిణీ, చౌక బియ్యం అందజేత వంటి పనులు చేస్తున్నారు. పోలీస్ శాఖలో, సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసుల నుంచి పైస్థాయి ఇన్‌స్పెక్టర్, ఆపైస్థాయి ఉద్యోగులు ఇందులో ఉన్నారు.
బాధ్యత ఏదైనా..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉద్యోగులు ఏ బాధ్యత అప్పగించినా కాదనకుండా చేస్తున్నారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్ (టీటీటీ) బాధ్యతలు చేస్తున్నారు. కరోనా నివారణలో ట్రిపుల్‌టీ ఎంతో ముఖ్యమైంది. కరోనా రోగులను గుర్తించడంలో ఆశా కార్యకర్తలు విస్తృతంగా పర్యటిస్తూ రోగులను గుర్తిస్తున్నారు. వారికి పాజిటివ్ వస్తే మందులు అందిస్తున్నారు. రోగం కుదిరే వరకు వైద్యుల సూచనలతో పర్యవేక్షణ చేస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక శాఖలో ఉద్యోగులు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. వీరంతా క్వారంటైన్, కొవిడ్ కేంద్రాల బాధ్యతల్లో ఉన్నారు. మమతలు చూపుతూ.. రోగులకు సాంత్వన కలిగిస్తూ పల్లెలను శుభ్రం చేస్తూ సేవామూర్తులుగా గుర్తింపు పొందుతున్నారు.
తీరిక లేకుండా..
2 నెలలుగా తీరిక లేకుండా వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. అత్యసర పరిస్థితుల్లో రాత్రి వేళల్లోనూ విధుల్లో ఉంటున్నారు. వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు ఎప్పుడు పిలిచినా వెళుతున్నారు. ఎక్కడ వైరస్ బయటపడిందంటే అక్కడకు వెళుతున్నారు. ఏ సమయంలో అయినా వెళ్లి సేవలు చేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఉన్న మహిళలు పరిసరాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లు శుభ్రం చేస్తున్నారు. అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నాయంటే చిత్తశుద్ధితో వీరు చేస్తున్న సేవలే కారణం.
ఇవీ చదవండి... వెంకటగిరి క్వారంటైన్ కేంద్రంలో బాధితుల నిరసన