నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామంలో ఓ మహిళ మృతదేహంతో కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన లలిత అనే మహిళ రెండు రోజుల క్రితం రోడ్డుపై వెళుతుండగా ఓ వ్యక్తి మద్యం మత్తులో బైకుతో ఢీ కొట్టాడు. తీవ్రగాయాలైన లలితను.. అతడే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించాడు. మహిళ వివరాలు, ప్రమాదానికి కారణాలను 108 సిబ్బంది అడగినా తనకు తెలియదంటూ తప్పించుకున్నాడు.
విషయం తెలియని కుటుంబ సభ్యులు లలిత కోసం గాలించి, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను 108 సిబ్బంది ఆస్పత్రికి తీసుకురాగా.. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వడంతో అసలు విషయం బయట పడింది. మృతురాలిని లలితగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తమకు న్యాయం చెయ్యాలంటూ లలిత మృతదేహంతో బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: