నీటి కష్టాలు... వేసవిలో భూగర్భజలాలు ఎండిపోవటం, చెరువుల్లో, కాలువల్లో నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడటం సాధారణం. కానీ ఒంగోలులోని చెరువుకొమ్మపాలెం, వెంగముక్కపాలెం, తుఫాన్పాలెం గ్రామాల పరిధిలోని పరిస్థితి వేరు. కళ్ల ముందే నీళ్లు ఉన్నా తాగలేని పరిస్థితి. ఆయా గ్రామాల సమీపంలో ఉన్న భగీరథ రసాయన పరిశ్రమల వల్ల భూగర్భ జలాలన్నీ విషపూరితమవుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలకు మంచి నీటి సమస్య ఏర్పడింది.
రంగుమారుతున్న నీరు...
బోరు బావుల్లోని నీటిని కొద్దిసేపు ఆరు బయట ఉంచితే రంగు మారిపోతుంది. బోరు నుంచి స్వచ్ఛమైన నీరు వస్తున్నట్లు కనిపిస్తున్నా... ఓ గంటసేపు తర్వాత చూస్తే పెట్రోలు రంగులో దర్శనమిస్తున్నాయి. దీంతో ఆందోళనకు సిద్ధమైయ్యారు గ్రామస్తులు. దగ్గరలోని కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలే ఈ పరిస్థితికి కారణమని ఆరోపిస్తున్నారు. ఈ నీటి వాడకంతో చర్మ సంబంధ వ్యాదులు, కిడ్నీ సమస్యలు వస్తున్నాయని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రసాయన వ్యర్థాలు విడుదల చేస్తూ నీటి కాలుష్యానికి పాల్పడుతున్న సదరు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని... భూగర్భ జలాలు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇది చూడండి:జల వివాదాలకు సెలవ్... కొత్తగా శాశ్వత ట్రైబ్యునల్!