Udayagiri MLA Mekapati Chandrasekhar Reddy: నెల్లూరు జిల్లాలోని రాజకీయాలు వైసీపీ అధిష్ఠానానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. నిన్న ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఆరోపణలు చేయగా.. ఈరోజు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రూపంలో వ్యతిరేకత ఎదురైంది. తనను నియోజకవర్గ పరిశీలకుడు ధనుంజయరెడ్డి ఇబ్బంది పెడుతున్నట్లు మేకపాటి ఆరోపించారు.
వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్లలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు జిల్లాలో నియోజకవర్గ పరిశీలకుడు ధనుంజయరెడ్డి తీరుపై అసంతృప్తి గళం వినిపించారు. ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించాల్సిన పరిశీలకుడు.. నియోజకవర్గంలో చిచ్చు పెడుతున్నాడని ఆరోపించారు. తనను ధనుంజయరెడ్డి ఇబ్బంది పెడుతున్నాడంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ధనుంజయ రెడ్డి నిర్ణయాల వలన పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆరోపించారు. తాను వైయస్ కుటుంబానికి విధేయుడినని.. తన మీద పెత్తనం చేయడానికి కుదరదంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రి దగ్గరైనా లేక జిల్లా మంత్రి దగ్గర తేల్చుకోడానికే కాదు.. దేనికైనా నేను సిద్ధమంటూ సవాలు విసిరారు.
'పరిశీలకుడిగా వారు చేయాల్సిన పనులు మాని.. వైసీపీ నేతలపై చర్యలు చేపడుతున్నారు. ఆయన చేసే పనులు అన్ని వక్రపనులే. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతోంది. ఇతను చేసే పనుల వల్ల పార్టీకి ఇబ్బందులు తప్పవు. వైఎస్ఆర్ పార్టీని బ్రష్టు పట్టించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ధనుంజయరెడ్డే.'-మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే
సీఎం జగన్ దృష్టి: ఇప్పటికే నెల్లూరు జిల్లా వైసీపీలో ముసలంపై సీఎం జగన్ దృష్టి సారించారు. తమ ఫోన్లను ప్రభుత్వ పెద్దలు ట్యాపింగ్ చేసినట్లు ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై.. సీఎం ఆరా తీయగా. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ పీఆర్ఎస్ ఆంజనేయులు, పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డితోనూ సీఎం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇవీ చదవండి: