నెల్లూరు జిల్లా కందలపాడు మండలంలోని కందలపాడులో ఉన్న చెరువులో నీరు ఖాళీ చేయడంతో గ్రామంలో నీటి ఎద్దడి నెలకొంది. గ్రామ సమీపంలో ఉన్న చెరువులో నీరు ఉంటే సమీపంలోని బావుల్లో నీరు ఉంటుంది. దీంతో వేసవిలో నీటి ఎద్దడి ఉండదు. కానీ ఈసారి చేపలు పట్టుకోవడానికి నీటిని బయటకు వదిలేశారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటాయి. బావులు ఎండిపోయాయి. ఫలితంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో నీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా అరుంధతీయవాడ వాసులు వారం రోజులుగా తాగునీరు లేక దాహార్తితో అల్లాడుతున్నారు.
సరఫరా చేయాలని ప్రజలు పంచాయతీ పాలకులు, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో నీటికి ఎక్కడకు వెళ్లాలో అర్థం కావడం లేదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. ఈప్రాంతం సమీపంలోని బావి నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. ఈనీటినే తాగు, వాడుక నీరుగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. బావిలో నీరు ఇంకి పోయింది. దీంతో పాటు ప్రత్యామ్నాయంగా ఉన్న బోరు మోటారు మరమ్మతులకు గురైంది. వారం రోజుల నుంచి గ్రామస్థులకు తాగునీరు సరఫరా చేయడం లేదు. దీంతో తాగు, వాడుక నీటికి ప్రజలు పడుతున్న బాధ వర్ణనాతీతంగా ఉంది.
తాగు, వాడుక నీటికి నగదు వెచ్చించి శుద్ధి జలాలను కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. పశువులకు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందిగా ఉందని ఆవేదన చెందుతున్నారు. బావిలో నీరు లేకపోవడంతో బీసీీ కాలనీ వద్ద ఉన్న మంచినీటి పథకం వాల్వ్ తిప్పితే మంచినీరు సరఫరా వస్తుందని, అక్కడ వాల్వ్‌లు కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్షం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సరఫరాకు చర్యలు - ధనలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి
గ్రామంలో తాగునీటి సమస్య ఉన్న విషయం మా దృష్టికి వచ్చింది. బావిలో పూర్తిగా నీరు ఇంకిపోవడం, బోరు మోటార్లు మరమ్మతులకు గురి కావడంతో సమస్య ఏర్పడింది. మోటార్లు మరమ్మతులు చేయించి, తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం.
ఇదీ చదవండి:
22 జర్మన్ షెడ్ల నిర్మాణానికి తితిదే నిర్ణయం.. రూ. 3.52 కోట్లు మంజూరు