రైతులను వైకాపా ప్రభుత్వం నట్టేట ముంచుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. అయినా రైతులకు అన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతన్నలు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలులో ఎడ్లబండిపై ఎక్కి ర్యాలీ నిర్వహించారు.
జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో రైతులు పడుతున్న ఇబ్బందులపై తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్లపై వినూత్న రీతిలో ర్యాలీలు, ధర్నాలు చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి నుంచి 11 కిలోమీటర్లు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ తీశారు. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు.
ధాన్యానికి నిప్పంటించి..
ధాన్యానికి తగిన ధరలు లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కల్లాల్లోనే ధాన్యం పోసి నిప్పంటించారు. రైతులకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల సంఘీభావం తెలిపారు. గతంతో పోల్చితే జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ దిగుబడులకు లాభాల కంటే నష్టాలే చేతికి వస్తున్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడం ఖాయమని అన్నారు. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రైతు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు.
రసాభాసగా వ్యవసాయ సలహా మండలి సమావేశం
కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో జరిగిన జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం రసాభాసగా సాగింది. రైతులు పడుతున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, జాయింట్ కలెక్టర్ హరిచంద్ర ప్రసాద్ దృష్టికి దృష్టికి వ్యవసాయ సలహా మండలి సభ్యులు ప్రదీప్ కుమార్ రెడ్డి తీసుకెళ్లారు. నెల్లూరు జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న విత్తనాలు ఎరువులు పురుగు మందులు రైతులకు సరిగా అందడం లేదని రైతులు మండిపడ్డారు. ఏపీ సీడ్స్ ద్వారా అందిస్తున్న విత్తనాలు సరిగ్గా ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన ట్రాక్టర్లు, రోటవేటర్, కల్టివేటర్ ఇవ్వడం లేదని వారు అన్నారు. ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకాన్ని రైతులకు చేరువచేయడంలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వ్యవసాయ సలహా మండలి సభ్యులు ఆరోపించారు.
దుర్భరంగా.. వ్యవసాయం
రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో బాగముగా గూడూరులో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు. గూడూరు మండలం తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో రైతాంగం మునుపెన్నడూ ఎదుర్కోని విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని మాజీ శాసన సభ్యులు సునీల్ కుమార్ ఆరోపించారు.
'రైతులను మ్యూజియంలో చూడాల్సివస్తుంది'
రైతులను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని తెదేపా రైతు సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. రైతన్నను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో ప్రదర్శన నిర్వహించిన తెలుగు రైతులు.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించడంలో వైకాపా ప్రభుత్వం రైతులను మోసగిస్తోందని తెదేపా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి గున్నయ్య విమర్శించారు.
'డెల్టా ప్రాంత రైతాంగం క్రాఫ్ హాలిడే ప్రకటించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి'
ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో నియోజకవర్గ స్థాయి తెదేపా నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి వినతిపత్రం సమర్పించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. రైతు వ్యతిరేక పాలన సాగిస్తోందని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచల బాబు యాదవ్, రాష్ట్ర తెలుగురైతు కార్యనిర్వాహక కార్యదర్శి రామారావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నా.. వైకాపా ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల రైతులకు కన్నీళ్లు మిగులుతున్నాయి అన్నారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని సోమశిల జలాశయంలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ డెల్టా ప్రాంత రైతాంగం క్రాఫ్ హాలిడే ప్రకటించాల్సిన దౌర్భాగ్య పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందన్నారు. వ్యవసాయాన్ని పండగ చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ప్రస్తుతం వ్యవసాయాన్ని దండగ చేశారన్నారు.
నాగలి, వరిధాన్యం చేతబట్టుకొని..
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ నెల్లూరు నగరంలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో పంటలు పండించిన రైతులకు కనీసం గిట్టుబాటు ధర దక్కటం లేదని తెదేపా నాయకులు ఆరోపించారు. నాగలి, వరిధాన్యం చేతబట్టుకొని నెల్లూరు నగరంలో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరు రూరల్ తహసీల్దార్ నాజర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి: TDP: చిత్తూరు జిల్లాలో 'రైతు కోసం తెదేపా'..పలుచోట్ల ఉద్రిక్తత