అమరావతి ఐకాస పిలుపునిచ్చిన జైల్ భరో కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. తెదేపా నెల్లూరు నగర ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని విజయమహల్ గేట్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా శ్రేణులు పోలీస్ వాహనానికి అడ్డంగా కూర్చుని అరెస్ట్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని పక్కకు నెట్టేసి కోటంరెడ్డిని బలవంతంగా స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. గుంటూరుకు వెళ్లేందుకు కూడా వీసా కావాలా అని ప్రశ్నించారు. అరెస్టులతో భయపడేది లేదని, అమరావతికి మద్దతుగా తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు.
జైల్ భరో కార్యక్రమానికి బయలుదేరేందుకు ప్రయత్నించడంతో తెదేపా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాత్రి నుంచి ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. అజీజ్ నివాసానికి ఉదయం నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యకర్తలతో పాటు నాయకులు గేట్ల దూకి గుంటూరు వెళ్లేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. గేటు దూకి వెళ్లేందుకు ప్రయత్నించిన అజీజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
గుంటూరు వెళ్లేందుకు ప్రయత్నించిన తెలుగు యువత నేతలను నెల్లూరులో పోలీసులు అరెస్టు చేశారు. హౌస్ అరెస్టులో ఉన్న తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నా తమను తీవ్రవాదుల్లా అరెస్టు చేయడం దారుణమని తిరుమల నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
జైల్ భరో కార్యక్రమానికి సంఘీభావంగా ఉదయగిరిలో తెదేపా మండల కన్వీనర్ బయ్యన్నస దుత్తలూరు మాజీ ఎంపీపీ శ్రీ కుర్తి రవీంద్రబాబు... పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. తెదేపా నాయకులను హౌస్ అరెస్టులు చేయడం దారుణమన్నారు. రైతులకు సంకెళ్లు వేసి ప్రభుత్వం దారుణంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. వారిపై బణాయించిన అఖ్రమ కేసులను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో వైకాపా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
ఇదీ చదవండి: