వరద బాధితులకు వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. తక్షణ సాయం కింద రూ.10వేలు చొప్పున అందజేయాలని నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. వరదలోచ్చి 20రోజులు గడిచినా.. ప్రభుత్వ సాయం ఇంకా అందకపోవటం దారుణమని తెదేపా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ విమర్శించారు.
జీవో15 ప్రకారం ఏడు రోజులపాటు ఇళ్లు నీట మునిగి ఉంటే రూ.2వేలు పరిహారం ఇస్తామనటం అన్యాయమన్నారు. నష్టం ఆధారంగా బాధితులకు పూర్తిస్థాయి పరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
గుంతకల్లు నియోజకవర్గంలో రైతులకు అండగా..
రైతులను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని తెదేపా మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆరోపించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని నాగసముద్రంలో రైతు కోసం తెలుగు దేశం కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. రైతులతో మాట్లాడి ఎంత మేరకు నష్టం వాటిల్లిందనే అంశాలను తెలుసుకున్నారు. అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టం అంచనాల్లో బోగస్ లెక్కలు చూపిస్తూ అన్నదాతలను నిండా ముంచుతున్నారని ఆరోపించారు. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని స్పష్టం చేశారు. ప్రజలకు తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పర్చూరులో రైతుకు నివాళి
అధికారం లేనప్పుడు పాదయాత్రలు చేసి, ఓదార్పులు చేపట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజలను కన్నెత్తి చూడటం లేదని మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చిననందిపాడులో ఆత్మహత్య చేసుకున్న రైతు రమేష్‌కు ఆయన నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. నివర్ తుపాను వల్ల రైతులు నష్టపోతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతుకు రూ.25 లక్షలు పరిహారమివ్వాలని పత్తిపాటి డిమాండ్ చేశారు. మిరప పంట నీట మునిగిందని రైతు రమేష్ ఆత్మహత్య చేసుకోవటం తమను కలిచివేసిందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ప్రభుత్వం పెట్టుబడికి రుణాలు ఇచ్చినట్లయితే ఇలాంటి పరిస్దితి వచ్చేది కాదన్నారు. వర్షాలకు దెబ్బతిన్న వ్యవసాయ పంటలకు ఎకరాకు రూ.30వేలు, ఉద్యానవన పంటలకు ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
హిందూపురంలో నిరసన దీక్ష
అనంతపురం జిల్లా హిందూపురంలోని ఇంద్రమ్మ కూడలి వద్ద తేదేపా నేతలు ప్రజా పోరు పేరిట నిరసన దీక్ష చేపట్టారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వయసుకు విలువ ఇవ్వకుండా సీఎం జగన్ మాట్లాడడం సమంజసం కాదని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన చేయటం లేదన్నారు. కేసుల మాఫీ కోసం వైకాపా ఎంపీలను కేంద్రం ముందు మౌనంగా కూర్చోపెట్టారని ఎద్దేవా చేశారు. సీఎం తన ఆస్తులు పెంచుకునేందుకు విశాఖపట్నంలో మరో రాజధాని ప్రస్తావన తెచ్చారని విమర్శించారు. ప్రజా వేదిక కూల్చివేతతో సీఎం జగన్ అణచివేత పరిపాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో మంచి పరిపాలన కొనసాగించాలని కోరారు.
కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూముల్లో వైద్య కళాశాల ఏర్పాటు చేయవద్దని వ్యవసాయ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వైద్య కళాశాల మరోచోట ఏర్పాటు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షకు నంద్యాల తెదేపా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మద్దతు తెలిపారు. శిబిరాన్ని సందర్శించి వైద్య కళాశాల ఏర్పాటుకు ఎవరూ వ్యతిరేకం కాదని.. అందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వైద్య కళాశాల ఏర్పాటు సమంజసం కాదన్నారు. కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షకు తెదేపా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి.. రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు