రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నెల్లూరు జిల్లాలో పాఠశాలలు తెరుచుకున్నాయి. జిల్లాలో 3893 పాఠశాలల్లో... 2.51లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. వీరిలో 9, పదో తరగతి విద్యార్ధులకు మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా 5 నెలల తరువాత పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలకు వచ్చేందుకు విద్యార్ధులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో 50శాతం మంది విద్యార్ధులు తరగతులకు హాజరవుతున్నారు. బడులకు వస్తున్న విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్నారు. పదో తరగతి విద్యార్ధులు పబ్లిక్ పరీక్షలకు సిద్దమవుతున్నట్లు తెలిపారు.
సిలబస్‌ను తగ్గించడంతో విద్యార్ధులకు ఊరట
ప్రభుత్వం సిలబస్‌ను తగ్గించడంతో విద్యార్ధులకు కొంత ఊరట కలిగింది. నాడు-నేడులో భాగంగా ప్రతి పాఠశాలల్లో కుళాయిలు ఏర్పాటు చేశారు. వచ్చిన విద్యార్ధులు నేరుగా కుళాయిల వద్దకు వెళ్లి చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. తరగతి గదుల్లో శానిటైజర్లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ బృందాలు జిల్లాలో పాఠశాలలను పరిశీలిస్తున్నాయి. ఏర్పాట్లు బాగున్నాయని విద్యార్ధులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
పారిశుద్ద్యానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ సామాగ్రి కొనుగోలుకు ప్రత్యేక నిధులు లేవు. ఉన్న కొద్ది బడ్జెట్లో రూ.4500 ఖర్చు చేసి శానిటైజర్లు కొనుగోలు చేశారు. మరుగుదొడ్లు కొన్ని పాఠశాలల్లో పూర్తి కాలేదు. పూర్తైన పాఠశాలల్లో శుభ్రం చేసే సిబ్బంది కరువయ్యారు. ఈ విద్యా సంవత్సరంలో పారిశుద్ద్యానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. మరుగుదొడ్లు, తరగతి గదులు శుభ్రం చేయడానికి సిబ్బందిని ఏర్పాటు చేస్తే కరోనా జాగ్రత్తలు పూర్తి స్థాయిలో అమలు చేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మధ్యలోనే ఆగిపోయిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్... ఆందోళనలో విద్యార్థులు