డిసెంబర్ 15వ తేదీలోగా నివర్ తుపాను నష్ట తీవ్రతపై అంచనాలు రూపొందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. డిసెంబర్ 31కి పరిహారం అందజేస్తామని ప్రకటించారు. సీఎం సమీక్షలోనూ బాధితులకు పరిహారం త్వరితగతిన అందించాలని ఆదేశించారని అన్నారు.
నెల్లూరు నగరంలోని పొర్లుకట్ట ముంపు ప్రాంతాన్ని మంత్రి పరిశీలించి.. బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. 20 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా పెన్నానదికి వరద వచ్చిందని అనిల్‌కుమార్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నగరానికి ఇబ్బంది లేకుండా నదికి ఇరువైపులా బండ్ ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. వీటిని బ్యారేజ్ పనులతోపాటు పూర్తి చేయిస్తామని వెల్లడించారు.
పొర్లుకట్ట ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలకు డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలుగానీ, ఇళ్లుగానీ అందిస్తామని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితులు ఇళ్లకు వెళ్లే సమయంలో ... ప్రతి ఒక్కరికీ 500 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. భారీ వర్షాలు, వరదలు నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపినా.. ప్రాణనష్టం జరగకుండా అధికారులు సమర్థవంతంగా పని చేశారని మంత్రి అభినందించారు. వరదతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ప్రతిపక్షాలు వారిని ఆదుకోకుండా ప్రభుత్వాన్ని విమర్శించడం దారుణమన్నారు.
ఇదీ చదవండీ...డిసెంబరు 15లోపు పంట నష్టం అంచనా వేయండి: సీఎం జగన్