శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు భారీగా చేరి గేట్లెత్తేస్తున్నా పోతిరెడ్డిపాడుకు మాత్రం నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం దురదృష్టకరమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. శ్రీశైలంలో 4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందన్న ఆయన.. రోజుకు 35 టీఎంసీలు జలాశయానికి చేరుతుందన్నారు. చెన్నైకు తాగునీటి కోసం తెలుగు గంగకు 9 టీఎంసీలిచ్చి ఆపేయమని కృష్ణా బోర్డు ఆదేశాలివ్వడం ఆశ్చర్యం కల్గిస్తోందన్నారు. తెలుగు గంగ కింద 5.50 లక్షల ఆయకట్టు ఉందన్నారు. ఒకటి రెండు రోజుల్లోనే శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్ నిండిపోతాయని, ఎగువ నుంచి ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నదులకు వస్తున్న వరదను చూస్తే ఎవరికైనా అర్ధమవుతుందన్నారు.
ప్రకాశం బ్యారేజి నుంచి వరదనీటిని సముద్రానికి వదిలేస్తున్న పరిస్థితుల్లో రాయలసీమపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. కృష్ణా బోర్డుకు ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వకపోవడం, వెనుకబడిన రాయలసీమకు తాగు, సాగునీటి ఆవశ్యకతను వివరించడంలో విఫలమవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు. అతి భారీవర్షాలు కురిస్తే తప్ప రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మొదటి పంటకే నీళ్లు అందని పరిస్థితి ఉందన్నారు. కరవుతో సతమతమవుతున్న రాయలసీమ ప్రాంతాన్ని కృష్ణా బోర్డుతో పాటు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే పూర్తిస్థాయిలో పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేయాలని సోమిరెడ్డి కోరారు.
ఇదీ చదవండి : గుర్రపుస్వారీ...ఖరీదైన బైక్లు.. విలాస జీవితం