Ambapuram land dispute in Nellore District: నెల్లూరు నగరం పొదలకూరు రోడ్డు శివారులో ఉన్న అంబాపురంలో ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. ఈ ప్రాంతంలో సుమారు 170 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ప్రస్తుతం ఈ భూమి అనేక మంది అక్రమార్కుల ఆక్రమణలో చిక్కుకుంది. ఇదే భూమిలోని సర్వే నంబర్ 1/1లో 12 ఎకరాలను 1970లో మాదిగ కులస్థులకు పట్టాలుగా ఇచ్చారు.
ఆరుగురు ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ భూమి విలువ పెరగడంతో.. ఆక్రమించేందుకు రాజకీయ నాయకులు ఎత్తులు వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే వెనుకబడిన కులాలను రెచ్చగొట్టి.. ఆక్రమణలకు పురిగొల్పుతున్నారని.. ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందులో స్థానిక వైఎస్సార్సీపీ నాయకుల ప్రమేయం ఉందని చెబుతున్నారు.
మాదిగ కులస్థుల ఆధీనంలో ఉన్న ఈ 12 ఎకరాల భూమిలో.. 3 నెలలుగా ఇతర వెనుకబడిన కులాల ప్రజలు గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సుమారు 200 మంది తరలిరావడంతో.. మాదిగలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. రెండు వర్గాల మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరాయి. పోలీసులు రంగప్రవేశం చేసినా.. ఆక్రమణలను ఖాళీ చేయించలేకపోయారు.
అక్కడ పరిస్థితులు ఎప్పుడు చేయిదాటిపోతాయోననే ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. తమ ఆధీనంలో ఉన్న భూమిని ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నదే రాజకీయ నాయకుల ఎత్తుగడ అని మాదిగలు ఆరోపిస్తున్నారు. కొందరిని అడ్డుపెట్టుకుని భూమిని స్వాధీనం చేసుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులను తమ స్థలాల్లోకి రానీయబోమని తెగేసి చెబుతున్నారు.
గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న యానాదులు మాత్రం.. ఇది ప్రభుత్వ స్థలమని.. వారిలాగే తామూ గూడు కట్టుకుంటున్నామని చెబుతున్నారు. మాదిగలు తమపై కర్రలు, కత్తులతో దాడులు చేసేందుకు వస్తున్నారని ఆరోపిస్తున్నారు. నాలుగైదు రోజులుగా గుడిసెల విషయంలో మాదిగలు, యానాదుల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. రెండు వర్గాలు కొట్లాటలకు సిద్ధం కావడంతో.. పోలీసులు 145 సెక్షన్ విధించారు.
"ఇదే 1/1 సర్వే నెంబర్లో 12 ఎకరాలను మాదికలకు ఇచ్చారు. 1970లో మాదిగలకు ఇస్తే అప్పటి నుంచి ఈ పొలాలను సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ పొలం మాదిగుల చేతులలలోనే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఈ స్థలానికి విలువ పెరగడంతో.. కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా.. ఈ స్థలంలో ప్లాట్లు వేసి అమ్మాలని ప్రయత్నాలు జరిగినాయి. ఈ రోజు స్థలంలో మాదిగలు గుడిసలు వేయకపోతే వీటిని కూడా ఆక్రమించుకునే వాళ్లు". - పందిటి సుబ్బయ్య, ఎమ్మార్పీఎస్ నాయకుడు
"ఇక్కడ ఈ భూమికి పట్టాలు ఉన్నాయి. మేము పరిశీలించి వీరికి సపోర్ట్ చేయడానికి వచ్చాము. ముఖ్యంగా ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఇది దళితుల భూమి. కానీ ఇక్కడ ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ యాదవ్.. రాజకీయంగా పతనం అవ్వడానికే ఇందులో తలదూర్చారు. ఈ భూమికి.. అనిల్ కుమార్‌కి సంబంధం ఏంటి". - విజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు, ఆలిండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘం
ఇవీ చదవండి: