ఈ రబీ సీజన్లో నెల్లూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సోమశిల జలాశయం ఎస్ఈ రమణరెడ్డి తెలిపారు. ప్రస్తుతం సోమశిల జలాశయం లో 73 టీఎంసీలు, కండలేరు జలాశయంలో 56 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. పెన్నా డెల్టా ఆయకట్టు కింద 4 లక్షల 60 వేల ఎకరాలకు, కండలేరు జలాశయం కింద 2 లక్షల 40 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించటం జరిగిందన్నారు.
ఎక్కడా నీటి కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న ఆయన.. నీటి సమస్య ఎక్కడైనా ఉంటే తమ దృష్టికి తెస్తే వెంటనే సమస్య పరిష్కారం చేస్తామన్నారు. గత ఏడాది తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న సోమశిల ముందుభాగం అప్రోచ్ పనులకు ప్రభుత్వం 115 కోట్ల రూపాయల అనుమతులు జారీ చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు.