ప్రతిభ గల ఎస్సీ, ఎస్టీ నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు 2008లో బెస్ట్ అవైలబుల్ స్కూల్(బీఏఎస్) పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికింద కార్పొరేట్ పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రవేశం కల్పించి.. వారు విద్యను పూర్తి చేసేంత వరకు ఉచితంగా విద్య, భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ప్రస్తుతం ఈ పథకం కింద జిల్లాలో 2,556 మంది చదువుతున్నారు. వీరిలో 9, 10 తరగతుల విద్యార్థులు పోను సుమారు 2,100 మంది ఉన్నారు. తాజా ఉత్తర్వులతో వీరంతా 2020-21 విద్యా సంవత్సరానికి ఇతర పాఠశాలలకు మారనున్నారు. ఆ మేరకు సాంఘిక సంక్షేమశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
34 పాఠశాలల్లో 2,556 మంది
జిల్లాలో బీఏఎస్ కింద గుర్తించిన 34 కార్పొరేట్ పాఠశాలల్లో 2,556 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా- వీరికి 2019-20 విద్యా సంవత్సరం వరకు రూ. 5.45 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఆయా విద్యా సంస్థలు ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇంత వరకు 2020-21 సంవత్సరానికి బీఏఎస్ కింద ప్రవేశాలకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇంకోవైపు రెండో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న బీఏఎస్ విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పించాలనే తాజా ఉత్తర్వులతో పాటు అమ్మఒడి పథకం ప్రవేశపెట్టడం వల్ల ఇక బీఏఎస్ రద్దయిందనే ప్రచారం జరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
బడ్జెట్ రావాల్సి ఉంది
బీఏఎస్ పథకం కింద చదువుతున్న విద్యార్థులకు ఫీజులకు సంబంధించిన బడ్జెట్ రావాల్సి ఉంది. మంజూరు చేసిన వెంటనే బకాయిలు చెల్లిస్తాం. ఎక్కడైనా విద్యా సంస్థలు విద్యార్థులను ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తే.. మా దృష్టికి తీసుకురావాలి. వారిపై చర్యలు తీసుకుంటాం. ఈ పథకం కింద 9, 10 తరగతుల విద్యార్థులను కొనసాగించాలని, 2 నుంచి 8 తరగతుల వరకు కౌన్సెలింగ్ నిర్వహించి ఇతర పాఠశాలలకు చేర్పించాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
- జీవపుత్రకుమార్ డీడీ, సాంఘిక సంక్షేమ శాఖ
ఇదీ చదవండి: