జిల్లాలోనే అల్లూరు డెల్టాకు ఎంతో గుర్తింపు ఉంది. ఇక్కడ అన్ని రకాల వరి సాగు జరగడం ప్రత్యేకత. 30 గ్రామాలకు తాగునీరు, 20 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఇక్కడి చెరువు అభివృద్ధికి నోచుకోక కొద్దినీరు మాత్రమే ఉండేది. దాంతో ఏటా నీటివెతలు తలెత్తేవి. రైతుల అభ్యర్థనల మేరకు అధికారగణం స్పందించడంతో చెరువు రూపురేఖలు మారిపోయాయి. నాలుగేళ్లలో దాదాపు రూ.7 కోట్లతో ఆధునికీకరణ పనులు చేశారు. దాంతో వర్షపు నీటి నిల్వ పెరిగింది. ఏడాదంతా నీరు ఉండటంతో తాగునీటి సమస్య తీరింది. చెరువు ఆధారంగా ఏర్పాటుచేసిన తాగునీటి పథకంతో 30 గ్రామాలకు తాగునీరు అందుతోంది. దాదాపు 32 వేల మంది జనాభా దాహార్తి తీరుతోంది. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు ఈ జలాలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెరువు నుంచి విడుదలయ్యే వృథా నీటితో దాదాపు 5 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. అల్లూరు ప్రాంతానికి ఏడాదికి దాదాపు రూ.50 లక్షల విలువైన మత్స్య సంపద వస్తోంది.
మహిళా చైతన్యం.. మహమ్మారి అంతం
ఉద్యమాలకు నెలవు దామరమడుగు. కమ్యూనిస్టుల పురిటి గడ్డగా ఖ్యాతి పొందింది. సీపీఎం ఉద్యమ నేత జక్కా వెంకయ్య స్వగ్రామం కావడంతో ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. 7,529 మంది జనాభా ఉన్న ఈ పల్లెలో 1990-91లో జక్కా వెంకయ్య ఆధ్వర్యంలో ‘మాఊరికి సారావొద్దు’ అనే నినాదంతో కలిగిరి మండలం దూబగుంటలో ఉద్యమం ఊపిరి పోసుకుంది. ఆ గ్రామంలో ఓ వ్యక్తి సారా తాగిన మత్తులో బావిలో పడి మృతిచెందిన సంఘటనతో ఆ గ్రామంలోని మహిళలు రోశమ్మ, కొండమ్మ నాయకత్వంతో జక్కా వెంకయ్య మహిళలను కూడగట్టి పాదయాత్ర ద్వారా సారాపై ఉద్యమాన్ని చేపట్టారు. ఈక్రమంలో దామరమడుగులోనూ మహిళలు చైతన్యవంతమయ్యారు. గ్రామంలో సారా దుకాణాలు, విక్రయాలను అడ్డుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు గ్రామంలో మద్యం దుకాణం లేదు.
స్వచ్ఛమై.. ఆరోగ్యమై..
సంపూర్ణ పారిశుద్ధ్యానికి మారుపేరుగా నిలిచింది కలిగిరి. 10 వేల జనాభా కలిగిన గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అయిదేళ్లుగా అవిరళ కృషి చేస్తున్నారు పంచాయతీ కార్యదర్శి వెలుగోటి మధు. చెత్త తరలింపునకు రెండు ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించేలా చర్యలు చేపట్టారు. దాంతో ప్రజలు కూడా చెత్తను వీధుల్లో వేయడం మానేశారు. ఎన్నో ఏళ్లుగా అన్యాక్రాంతమైన పంచాయతీ స్థలాలను స్వాధీనం చేసుకొని ఎలాంటి ఆరోపణలు లేకుండా బహిరంగ వేలం నిర్వహించి వ్యాపారులకు లీజుకిచ్చారు. దాంతో నెలకు రూ.2 లక్షలకు పైగా పంచాయతీకి అదనపు ఆదాయం సమకూరేది. మార్కెట్ గదులకు కూడా అద్దెలు పెంచారు. అలా పంచాయతీకి నెలకు రూ.4 లక్షల ఆదాయం వచ్చేలా చేశారు. ఇంటి పన్నుల వసూళ్లలోనూ ప్రగతి సాధించారు. 12 మంది ఉన్న పారిశుద్ధ్య కార్మికులను 22కి పెంచారు. దాంతో పారిశుద్ధ్య చర్యలు మెరుగ్గా సాగుతున్నాయి.
పరిశ్రమిస్తూ.. పురోగమిస్తూ..
పదేళ్ల కిందట తడ ఒక సరిహద్దు గ్రామం.. నిత్యావసరాలు తప్ప దుస్తులు, ఇతర వస్తువులు కొనుగోలు చేయాలన్నా 13 కి.మీల దూరంలో ఉన్న సూళ్లూరుపేట, చెన్నై పట్టణానికి వెళ్లాల్సి వచ్చేది. స్థానిక యువత ఉపాధికి ఇతర పట్టణాలకు వలస వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇక్కడి శ్రీసిటీలో 150కి పైగా స్వదేశీ, విదేశీ సంస్థలు కొలువుదీరాయి. మాంబట్టు పారిశ్రామికవాడలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. దాంతో ఇతర రాష్ట్రాల యువతీ యువకులు తడకు వస్తున్నారు. ఒకప్పుడు 10వేల లోపు ఉండే జనాభా ఏకంగా 30 వేలకు పెరిగింది. ఇదంతా పరిశ్రమల రాకతోనే సాధ్యమైంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మంది ఉపాధి పొందుతున్నారు. తెల్లారేసరికి వృద్ధులు తప్ప ఇళ్ల వద్ద ఎవరూ ఉండటం లేదు. ఇళ్లకు తాళాలు వేసి భార్యాభర్తలిద్దరూ పరిశ్రమల్లో పనులకు వెళ్లిపోతున్నారు.
అక్షర కాంతి.. ప్రగతి క్రాంతి
నెల్లూరు జిల్లా అక్షర కాంతులీనుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుల ఆవశ్యకత పెరిగింది. 1991 నుంచి అక్షరాస్యత క్రమేపీ పెరుగుతూ వస్తోంది. వయోజన విద్యలోనూ ప్రగతి కనిపిస్తోంది. జిల్లాలో అక్షరాస్యులు 68.90 శాతం మంది ఉన్నారు. అత్యధికంగా నెల్లూరు మండలంలో 80.73 శాతం అక్షరాస్యత సాధించగా.. అతి తక్కువగా డక్కిలి మండలంలో 57.57 శాతం నమోదైంది.
యువత ఉపాధికి ఢోకా లేదు
యువత ఉపాధికి ఇప్పుడు తడలో ఢోకాలేదు. మండల ప్రజలకు అందుబాటులో వందల పరిశ్రమలు ఉన్నాయి. పరోక్షంగా పలు రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఈ గ్రామం వేదికగా మారింది. యువత మేధోశక్తికి తగిన కొలువులు దక్కుతున్నాయి. ఇక్కడ ఆన్‌లైన్ వ్యాపారానికి గిరాకీ బాగా పెరిగింది. దాంతో నేనూ అదే చేస్తున్నా. - నందకుమార్
చెత్త సేకరణ విధానం బాగు
వీధుల్లో చెత్త సేకరణ విధానం చాలా బాగుంది. ఇళ్లలోని చెత్తను డబ్బాలో వేసుకుని, ఇంటి దగ్గరకు వచ్చిన ట్రాక్టరులో పోస్తున్నాము. కాలువల్లో పూడిక లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. - జె.దొరసానమ్మ, కొత్తూరు, కలిగిరి
వెలుగులు విరిశాయి
మొదట్లో సారా కారణంగా కుటుంబాల్లో తగాదాలు, గొడవలు జరుగుతుండేవి. అమ్మకాలు నిలిపివేశాక అందరి జీవితాల్లో వెలుగులు విరిశాయి. జక్కా వెంకయ్య పోరాటం ఫలితంగా మా గ్రామంలో నేటికీ మద్యం మహమ్మారికి చోటు లేదు. - జి. శ్రీనివాసులు, దామరమడుగు
పంటలతో మంచి కీర్తి
అల్లూరు చెరువుతో డెల్టాకు మంచి కీర్తి దక్కింది. ఇక్కడ పంటలకు పుష్కలంగా నీరుండటంతో మంచి గుర్తింపు వచ్చింది. సాగు, తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. భవిష్యత్తులో చెరువును ఇంకా అభివృధ్ధి చేస్తే మరిన్ని సత్ఫలితాలు వస్తాయి. - ఐ.భాస్కర్‌రెడ్డి, అల్లూరు
ఇదీ చదవండి: తొలిరోజు మందకొడిగా నామినేషన్లు.. స్వతంత్రులూ తెరపైకి..!