నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు పెద్ద పురపాలక సంఘం. ఇక్కడ 23వార్డులు, లక్ష మందికిపైగా జనాభా నివసిస్తున్నారు. ఇక్కడి కాలనీల్లో పందులది ఇష్టారాజ్యం అయిపోయింది. గుంపులు గుంపులుగా రోడ్లపై సంచరిస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, జేఆర్పేట ప్రాంతాల్లో పందులు వందలాదిగా సంచరిస్తుంటాయి. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలను మురికి గుంతలుగా మార్చేస్తున్నాయి. ఇళ్లలోకి ప్రవేశించి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. పందుల సంచారంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
ఏడాదికోసారి పురపాలక సంఘం అధికారులు పందుల కట్టడి కోసం హడావిడి చేస్తారని.. తరువాత మళ్లీ మామూలేనని ప్రజలంటున్నారు. ఆత్మకూరు బైపాస్ రోడ్డులో పందుల పెంపకం కోసం ఐదు ఎకరాలు కేటాయించినప్పటికీ అది అమలు కాలేదు. దీంతో పట్టణ ప్రజలు పందుల దెబ్బకు బాబోయ్ అంటున్నారు. హోటల్స్, టిఫిన్ బండ్ల వద్ద పందులు తిరుగుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.
పందులు ఇళ్లల్లోకి వస్తున్నాయి. వాటి యజమానులు ఇష్టారీతిని వ్యవహరించడంతో పందులు కాలనీల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
-కాలనీ వాసుడు
ఆత్మకూరు పురపాలకసంఘం పరిధిలో పందుల స్వైరవిహారం రోజురోజుకు పెరిగిపోతోంది. చిన్నారులు వీధుల్లో తిరిగేందుకు భయపడుతున్నారు. చిన్నపిల్లలను పందులు కరిచిన సంఘటనలూ పట్టణంలో చోటు చేసుకున్నాయి. -కాలనీ వాసుడు
ఇప్పటికైనా అధికారులు స్పందించి పందుల సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీచదవండి.