నెల్లూరు ప్రజలకు ఆహ్లాద వాతావరణాన్ని అందించాలన్న ఉద్దేశంతో 2014లో అప్పటి ప్రభుత్వం..... స్వర్ణాల చెరువును సుందరంగా తీర్చిదిద్దంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ చెరువు అభివృద్ధికి రొట్టెల పండుగ పేరుతో ఏటా నిధులు కేటాయిస్తూ వచ్చారు. 2014లో స్వర్ణాల చెరువు అభివృద్ధికి ప్రణాళిక రూపొందించిన నగరపాలక సంస్థ అధికారులు..... రొట్టెల పండుగ జరిగే బారాషాహీద్ దర్గా ప్రాంతంలో చెరువును అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఏటా 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చక్కటి ఉద్యానవనంగా తీర్చిదిద్దారు. వేలాది మంది నగర ప్రజలతో పాటు రొట్టెల పండుగకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచిన ఈ ప్రాంతం..... మూడేళ్లుగా మోడువారింది. నిర్వహణకు నోచుకోక అపరిశుభ్రంగా మారింది. చెరువులో నీరు దుర్గంధం వెదజల్లుతోంది. స్నానపు ఘాట్లు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతమంతా మందుబాబులకు అడ్డాగా మారి.... నగర ప్రజలు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.
బారాషాహీద్ దర్గాకు సమీపంలోని నెక్లెస్ రోడ్డులోనూ..... నాలుగేళ్ల క్రితం పది కోట్ల రూపాయలతో మరో పార్కును ఏర్పాటు చేశారు. చెరువు చుట్టూ మొక్కలు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఇరుకలమ్మ ఆలయం కలిసే విధంగా స్నానాల ఘాట్‌ను నిర్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతమూ నిర్లక్ష్యానికి గురవుతోంది. ఉద్యానవనంలోని రోడ్లు పగిలిపోయాయి. మొక్కలన్నీ ఎండిపోయి...... పారిశుద్ధ్యం ఆనవాళ్లు లేకుండా పోయింది. స్వర్ణాల చెరువులో బోటు షికారు వంటివి ఏర్పాటుచేసి.. అభివృద్ధి చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి