నెల్లూరు జిల్లాలో వైకాపా అభ్యర్థులకు ప్రత్యర్థులుగా నామినేషన్లు వేసిన వారందరికీ పోలీసులే స్వయంగా ఫోన్ చేసి బెదిరిస్తున్నారని... మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. పొదలకూరు, మనుబోలు పోలీసుల కాల్ డేటాను ఎన్నికల పరిశీలకులు వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా ఆయన కనీసం స్పందించట్లేదని వాపోయారు.
అధికార పార్టీ అరాచకాలపై పోలీసులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా తిరిగి తమవారిపైనే కేసులు పెడుతున్నారని... తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతల పార్టీ మార్పిడిపై స్పందించిన ఆయన... దాని వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఏకగ్రీవంగా మారిన స్థానాల్లో ఎన్నికలను రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు.
వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో సీఎం జగన్ తొలిస్థానంలో ఉంటారని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లపైనా మండిపడ్డారు. పోలీసుల తీరుపై ఆగ్రహించిన తెదేపా నేతలు... గవర్నర్ వెంటనే కలుగజేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను నిర్వహించే సత్తా రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... మాచర్ల పురపాలక పీఠం వైకాపా వశం..!