రాష్ట్రవ్యాప్తంగా విపరీత ప్రచారం పొందిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే సమయంలో హైకోర్టు నుంచీ అనుకూల తీర్పు రావటంతో కృష్ణపట్నంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 21 నుంచీ పోలీసుల భద్రతలో ఉన్న ఆనందయ్య... ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి సోమవారం సొంతూరిలో అడుగుపెట్టడంతో...కోలాహలంగా మారింది. ఊరుఊరంతా ఘనస్వాగతం పలికారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో సన్మానం చేశారు.
ప్రభుత్వ అనుమతి లభించటంతో... ఔషధం తయారీని ప్రారంభించేందుకు ఆనందయ్య, ఆయన శిష్యులు సన్నద్ధమవుతున్నారు. ఔషధాల కొరత ఉందని, వాటిని సేకరించుకునేందుకు కనీసం 3 రోజుల సమయం పడుతుందని చెప్పారు. పంపిణీపై స్పష్టమైన తేదీని ప్రకటిస్తానని చెప్పారు. తన రక్షణ కోసం ప్రార్థించిన ప్రజలకు, పరిశోధనలు అనంతరం అనుమతి ఇచ్చిన ప్రభుత్వానికి ఆనందయ్య ధన్యవాదాలు తెలిపారు.
కంటి ద్వారా ఔషధం వేయటంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని..రెండు మూడు రోజుల్లో నివేదిక వచ్చే అవకాశముందని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. మిగిలిన మూడు పద్ధతుల్లో ఇచ్చే ఔషధంతో ప్రమాదం లేదని చెప్పారు. ఔషధ పంపిణీపై జిల్లా అధికారులు ఓ విధానాన్ని రూపొందిస్తారని..త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని ఎమ్మెల్యే గోవర్థన్‌రెడ్డి తెలిపారు. అప్పటివరకూ ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దని కోరారు. ఔషధ పంపిణీకి ప్రజలు పూర్తిగా సహకరించాలని, ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సంయమనం పాటించాలని ఆనందయ్య, ప్రజాప్రతినిధులు కోరారు.
ఇదీ చదవండి: